
ఒంగోలులో దివ్యాంగురాలు పెద మూగమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ శ్రీధర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నా బుధవారం పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు వానలోనూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 59,18,673 మందికి ప్రభుత్వం పింఛను డబ్బు విడుదల చేసింది. 1వ తేదీనే 54,10,830 మంది లబ్ధిదారులకు (91.42 శాతం మందికి) రూ.1,263.23 కోట్లు అందాయి. తొలిరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93.57 శాతం మందికి, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 89.04 శాతం మందికి పింఛన్లు పంపిణీ అయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గురు, శుక్రవారాల్లో కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్నా, పింఛన్ల పంపిణీలో మొక్కవోని లక్ష్యంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది శ్రద్ధ చూపారని మంత్రి అభినందించారు.
పారాణి పాదాలతోనే పింఛన్ల పంపిణీ..
గంపలగూడెం: పెళ్లి పీటలు ఎక్కబోతూ.. పారాణి పాదాలతోనే ముందుగా పింఛన్లు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా గంపలగూడెంలో వలంటీరు కోట శివకృష్ణ. అతడికి మైలవరం మండలం మొర్సుమల్లికి చెందిన యువతితో బుధవారం ఉదయం 7.55 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. 35 కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటివద్ద కల్యాణ మంటపానికి వెళ్లాల్సి ఉన్నందున వేకువజామున 4 గంటలకే శివకృష్ణను కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి కుమారుడిని చేశారు.
పెళ్లి బట్టలు ధరించి బాసికాలు, కాళ్లకు పారాణితోఉన్న శివకృష్ణ ఉదయం 6 గంటల వరకు తన పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఆ తర్వాత ముహూర్తానికి సమయం అవుతుండటంతో మొర్సుమల్లికి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివకృష్ణను గ్రామస్తులు, అధికారులు అభినందించారు.
కిడ్నీ బాధితురాలికి తక్షణమే పింఛన్ మంజూరు చేయించిన సెర్ప్ సీఈవో
గుంటూరు జిల్లా అమరావతి రూరల్ మండలానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు గీతకు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెంటనే పింఛను మంజూరు చేయించారు. ఆధార్, ఈ–కేవైసీ సమస్య కారణంగా పింఛను మంజూరుగాక ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. సిబ్బందితో కలిసి స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు.
పెళ్లి మంటపం నుంచి పింఛన్ల పంపిణీకి..
పరిగి/కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి తంతు ముగియగానే నేరుగా పింఛన్ల పంపిణీకి వెళ్లి పలువురి ప్రశంసలు అందుకున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు. పరిగి మండలం ముల్లమోతుకపల్లిలో వలంటీర్‌గా చేస్తున్న హరీష్‌రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు గ్రామంలోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మిని వివాహమాడారు. పెళ్లి వేడుక ముగియగానే నేరుగా వెళ్లి తన పరిధిలోని మొత్తం 27 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన వలంటీర్ వరలక్ష్మికి యనకల్లుకు చెందిన ఈశ్వర్‌తో వివాహమైంది. వేడుక పూర్తికాగానే ఆమె వెళ్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment