సాక్షి, అమరావతి : విశాఖపట్నం మురికివాడల్లోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు అందిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీలోని మొత్తం 13 ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించనుంది. ఇటీవల మంగళగిరి, తెనాలిలలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించిన టిడ్కో అధికారులు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనూ నేడు తొలి విడతగా 2,632 యూనిట్లను లబ్ధిదారులకు అందించనున్నారు. విశాఖ మహానగరంలో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా, తొలి విడతలో రాజీవ్ కాలనీ, పైడిమాంబ కాలనీ, చిలకపేట, ఆదర్శ గ్రామం, సీహార్స్ కాలనీ, గౌరీనగర్, సుద్దగెడ్డ, ఏఎస్‌ఆర్ కాలనీ, టీఆర్ ముత్యమాంబ కాలనీ, రాతిచెరువు, అగనంపూడి, పరవాడ, చినముషిడివాడ ప్రాంతాల్లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రజలు జీవించేందుకు అవసరమైన కనీస వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ 13 కాలనీల్లో నేడు పక్కా ఇళ్లతోపాటు రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించి నిరుపేదలు సగౌరవంగా జీవించే స్థాయిలో ఇళ్లను నిర్మించారు. అన్ని వసతులతో పూర్తిచేసిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లుచేసినట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని శనివారం లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వివరించారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో పంపిణీ ఏర్పాట్లను శుక్రవారం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
డిసెంబర్‌లో మరో 8 వేలు
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నాం. శనివారం మొదటి విడతగా 2,632 యూనిట్లను 13 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందిస్తాం. డిసెంబర్‌లో మరో 8 వేల ఇళ్లను పంపిణీ చేస్తాం. మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందిస్తాం. టిడ్కో ఇళ్లు నిర్మించిన అన్నిచోట్లా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు కల్పించాకే ఇళ్లను అప్పగిస్తున్నాం.
– చిత్తూరు శ్రీధర్, టిడ్కో ఎండీ
Comments
Please login to add a commentAdd a comment