కర్నూలు జిల్లా కౌలూరులో దూదేకుల మౌలాలమ్మకు పింఛన్ అందిస్తున్న వలంటీర్ లక్ష్మన్న
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం తొలిరోజు 50.75 మేర పూర్తయింది. రాష్ట్రంలో 61.51 లక్షల మందికిపైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.73 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సాంకేతిక కారణాలతో బ్యాంకుల నుంచి నగదు విడుదల ఆలస్యమైంది. దీంతో తొలిరోజు పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయలేకపోయారు. గతనెల వరకు పెన్షన్ నిధులను సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బదిలీ చేయడంతో కేవలం మూడు నుంచి ఐదుగంటల్లో ఆ నిధులు సచివాలయ ఖాతాలకు చేరేవి. కానీ ఈ నెలలో సీఎఫ్‌ఎంఎస్ విధానానికి బదులు పీఎఫ్‌ఎంఎస్ విధానంలో బదిలీ చేయడంతో బ్యాంకుల నుంచి నిధుల బదిలీకి 16 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దీంతో మంగళవారం 31,22,227 మంది లబ్ధిదారులకు రూ.793.82 కోట్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి వచ్చేనెల నుంచి నిధుల బదిలీ ఆలస్యం కాకుండా చూస్తామని బ్యాంకులు ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు సమాచారం.
కోమాలో ఉన్న వ్యక్తికి పింఛను
కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లబ్ధిదారు వద్దకు వెళ్లి కుటుంబసభ్యులకు పింఛను అందజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామ వలంటీరు మస్తానమ్మ. గ్రామానికి చెందిన శేషయ్య ఆరోగ్యం సరిగా లేక కోమాలోకి వెళ్లాడు. అతడికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు మస్తానమ్మ నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కోమాలో ఉన్న శేషయ్య వేలిముద్రలు తీసుకుని ఆయన కుటుంబసభ్యులకు పింఛను నగదు అందజేశారు.
పక్క రాష్ట్రానికి వెళ్లి పంపిణీ
చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ సర్కిల్ సచివాలయం 26వ వార్డు వలంటీర్ నాగూర్‌బాబు తన పరిధిలోని పింఛనుదారుకు తమిళనాడు వెళ్లి మరీ డబ్బు అందజేశారు. ఆ వార్డు క్లస్టర్ పరిధిలోని మహేశ్వరి అనారోగ్యంతో తమిళనాడులోని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ 80 కిలోమీటర్ల దూరంలోని తిరువళ్లూరు వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న మహేశ్వరి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment