
సాక్షి, పులివెందుల: భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ కొనసాగుతోంది. తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈసీ గంగిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పులివెందులలో కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.
నాన్న మరణం మాకు తీరని లోటు
తండ్రి మరణంపై వైఎస్ భారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈసీ గంగిరెడ్డి జ్ఞాపకాలను స్మరిస్తూ కంటతడి పెట్టారు. ఆయన సంస్మరణలో సభలో వైఎస్ భారతి మాట్లాడారు. ‘మా నాన్న ఈసీ గంగిరెడ్డి మనసున్న డాక్టర్. ఆయన హస్తవాసి మంచిదన్న పేరుంది. ప్రజల వైద్యుడిగా నాన్నకు మంచి గుర్తింపు ఉంది. క్రమశిక్షణ, విలువలు పాటించి నాన్న అందరికీ అదర్శంగా నిలిచారు. ప్రతి రోజూ 300 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారు. రోజూ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా కలవడానికి వస్తే..నాన్న ఆప్యాయంగా పలకరించే వారు. తనకు వ్యతిరేకంగా ఉన్నా.. వారితో ప్రేమగా మాట్లాడేవారు. వైద్యం కోసం వచ్చేవారిని ఆత్మీయులుగా భావించేవారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.. నాన్న మరణం మాకు తీరని లోటు’అని వైఎస్ భారతి పేర్కొన్నారు.
(చదవండి: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment