మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు | Donation of Rs 228 Crores to IIT Madras: Dr Krishna Chivukula | Sakshi
Sakshi News home page

మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు

Published Sun, Aug 11 2024 6:21 AM | Last Updated on Sun, Aug 11 2024 6:22 AM

Donation of Rs 228 Crores to IIT Madras: Dr Krishna Chivukula

అందుకే ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం ఇచ్చా

మనదేశంలోనూ అత్యున్నత విద్యాసంస్థలు ఉన్నాయి

విదేశాల్లో చదువుకున్నా.. యువత దేశానికి తిరిగి రావాలి

భారత్‌లోనూ ఇప్పుడు ఎన్నో అవకాశాలు

 విద్యారంగం అభివృద్ధి.. దేశాభివృద్ధికి కారకం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త, ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి డాక్టర్‌ కృష్ణ చివుకుల

‘ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా.. మన మాతృభూమిని మరవకూడదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. జన్మభూమికి సేవ చేసేందుకు ముందుకు రావాలి. ముఖ్యంగా విద్యా రంగంలో చేసే సేవ.. భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళమిచ్చాను. అదే విధంగా పాఠశాల స్థాయిలోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను’ అని అంటున్నారు.. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి, అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త డాక్టర్‌ కృష్ణ చివుకుల. ఇంత భారీ విరాళంతో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఎంతో కొంత తిరిగివ్వాలి..
    మనం పుట్టి పెరిగి, మన అభివృద్ధికి పునాది వేసిన మాతృభూమికి.. ఎంతో కొంత తిరిగివ్వాలి అనేది నా ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తు తరాలు ఎదిగే అవకాశం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో నేను ఐఐటీ మద్రాస్‌కు విరాళమిచ్చాను. 74 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాను.మా సంస్థ నంబర్‌వన్‌ పరిశ్రమగా ముందుకెళుతోంది. ఆదాయం విషయంలో ఆందోళన లేదు. అందుకే.. నేను చదివిన ఐఐటీ మద్రాస్‌కు, అక్కడి విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడేలా విరాళమిచ్చాను.

విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే దేశాభివృద్ధికి తోడ్పడినట్టే..
    విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే.. భవిష్యత్తులో అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందనేది నా నమ్మకం. ఎందరో విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులతో.. ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఇలాంటి వారికి తోడ్పడితే ఉన్నత విద్యావంతులుగా రూపొందుతారు. తద్వారా నిపుణులైన మానవ వనరుల కొరత కూడా తీరుతుంది. ఇది సంస్థల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఇతర పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని ఆశిస్తున్నాను.

స్వదేశంలో చదువులకే ప్రాధాన్యమివ్వాలి..
    ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు.. విదేశీ విద్య కోసం యూఎస్, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి స్వదేశంలో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలనేది నా అభిప్రాయం. 1.3 బిలియన్‌ జనాభా ఉన్న మన దేశంలో 10 లేదా 11 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్లినా.. ఆందోళన చెందక్కర్లేదు. అయితే వారు తమ చదువు పూర్తయ్యాక మన దేశానికి తిరిగొచ్చి సేవలు అందించాలి. మేం చదువుకునే రోజుల్లో ఇన్ని మంచి విద్యా సంస్థలు లేవు కాబట్టే నేను అమెరికా వెళ్లాను. 

పెట్టుబడిదారులు ముందుకు రావాలి..
    ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ తిరుగులేని శక్తిగా దూసుకెళుతోంది. అమెరికా ఆర్థిక పురోగతి మందగమనంలో ఉంటే.. మన ఆర్థిక పురోగతి దినదిన ప్రవర్థమానమవుతోంది. ఇదే చక్కని సమయంగా భావించి పెట్టుబడిదారులు ముందుకు రావాలి. మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి, ఉద్యోగ కల్పన, దేశ అభివృద్ధికి సహకరించాలి.

ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి..
    యువతలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్నారు. ఇందుకోసం పరిశోధనలపై దృష్టి పెడుతున్నారు. అయితే.. వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే వ్యాపార ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి. కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా.. సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఆలోచనలు చేయాలి.

ఆత్మవిశ్వాసంతో కదలాలి.. 
    యువత ముఖ్యంగా.. జెన్‌–జెడ్‌ వారు ఏ పని తలపెట్టినా, ఎందులో అడుగుపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. తమపై తాము నమ్మకంతో వ్యవహరించాలి. చేయగలమా? లేదా? అనే మీమాంసతో ఉంటే అడుగులు ముందుకు పడవు. ఇది అంతిమంగా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో అడుగులు వేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.

కష్టపడటమే.. విజయానికి సూత్రం..
    నేటి తరం విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుతాయని గుర్తించాలి. చదువుకునే సమయంలోనే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు పొందేలా కృషి చేయాలి. సర్టిఫికెట్ల కోసం కాకుండా.. శ్రేష్టత కోసం చదవడం ముఖ్యమని గుర్తించాలి.


కృష్ణ చివుకుల గురించి..
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. విద్యాభ్యాసం విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌), ఐఐటీ మద్రాస్‌ నుంచి ఎంటెక్‌ (ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. తుమకూరు యూని వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 1976లో అమెరికాలోని హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 1990లో న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్‌ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. 1997లో.. ఇండో– యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. దీన్ని మెటల్‌ ఇంజక్షన్‌ మోడలింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు.

దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు..
ఇప్పుడు మన విద్యా రంగం ఉన్నతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు మరె­న్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.వీటిని మరింత అభివృద్ధి చేస్తే.. మరింత నిపుణులైన మాన­వ వనరులను తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి.

మంచి వేతనాలు అందించాలి
విదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న విషయం.. వారికి భవిష్యత్తులో లభించే వేతనాలు. మన దేశంలో చదువుకున్నవారికి కూడా మంచి వేతనాలు అందించేలా పారిశ్రా­మికవేత్తలు, సంస్థలు అడుగులు వేయాలి. నైపుణ్యాలకు అనుగుణంగా ఆకర్షణీయ వేతనాలివ్వాలి. ప్రతిభావంతులను నియమించుకుంటే సంస్థలను వృద్ధి బాటలో నడిపించొచ్చు. ఇది కార్యరూపం దాల్చితే యువత దేశంలోనే చదువుకునేందుకు ముందుకొస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement