పెరవలి: ఆమె పేరు దోనెల కృష్ణవేణి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి. 35 ఏళ్ల వయసున్న ఆమె పుట్టుకతో దివ్యాంగురాలు(మూగ,చెవుడు). అవివాహితురాలైన ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణవేణికి వికలాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు హయాంలో వైకల్యం 30 శాతమేనంటూ తిరస్కరించారు. జన్మభూమి కమిటీలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఇక ప్రయత్నాలు మానుకున్నారు. అయితే వీరి విషయం తెలుసుకున్న పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్ చొరవ తీసుకుని ఎంపీడీవో రమేష్‌కు చెప్పి కృష్ణవేణి వికలాంగ పింఛన్ దరఖాస్తును ఆన్లైన్ చేయించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్నాయుడి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఎంపీపీ తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే ఈ దరఖాస్తును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరు చేయించారు. బుధవారం ఖండవల్లిలో నిర్వహించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తల్లి లక్ష్మీపార్వతితో కలసి కృష్ణవేణి పింఛన్ అందుకుంది. ఆ సమయంలో తల్లీ కూతుళ్ల ముఖాల్లో చెప్పలేని ఆనందం తొణికిసలాడింది. సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలి.. అప్పుడే మాలాంటోళ్లకి మేలు జరుగుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment