మిర్యాల చంద్రయ్య (ఫైల్)
సాక్షి, మన్యం పార్వతీపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పూర్వపు ఇన్‌చార్జి వైస్ చాన్సలర్, రూరల్ డెవలప్‌మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య (67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
పశువుల కాపరిగా ప్రస్థానం..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్యది విజయనగరం జిల్లా. పాలేరు కుమారుడిగా జీవితం ప్రారంభించి బాల్యంలో అనేక కష్టాలు పడ్డారు. పశువుల కాపరిగా పనిచేశారు. వసతి గృహల్లో చదువుకుని ఆంధ్రావిశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. 2008లో జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో పనిచేస్తున్న వారిలో 34 మంది ఏయూ మాతృ సంస్థకు వెళ్లిపోగా, ఐదుగురు మాత్రమే ఇక్కడ ఉండిపోయా రు. అందులో చంద్రయ్య ఒకరు. వర్సిటీలో విభాగా ధిపతిగా, ప్రిన్సిపాల్‌గా, చీఫ్ వార్డెన్‌గా అనేక బాధ్యతలు నిర్వహించారు. రెక్టార్ హోదాలో 2016 మే 14 నుంచి 2017 జూన్ 30 వరకు ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా వ్యవహరించారు. వీసీగా పనిచేస్తూనే రెగ్యులర్ గా తరగతులు బోధించేవారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించేవారు.
సమయపాలన పక్కా..
చంద్రయ్య సమయ పాలన కచ్చితంగా పాటించేవారు. ఇన్‌చార్జ్ వీసీగా సమయంలో బోధకులు సమయపాలన పాటించకపోతే సహించేవారు కాదు. దీంతో బోధకు లు ఆయనపై తిరగబడ్డారు. మీరు వీసీనా.. వాచ్ మ్యానా..? అంటూ ప్రశించారు. తాను వర్సిటీకి వాచ్‌డాగ్ అంటూ సమాధానం ఇచ్చారు. సమయపాలన పాటించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల ఉత్తమ ఉపాధ్యా య విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఈయన మృతి పట్ల ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ప్రొఫెసర్ పీలా సుజాత సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment