Dr BR Ambedkar Open University
-
సాధారణ డిగ్రీతో పాటు ఉపాధి కోర్సులు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు, ఉపాధి కల్పించే కోర్సులను అనుసంధానం చేసినట్టు యూనివర్సీటీ సహాయ సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ వచ్చిన ఆయన ఆదివారం మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో గల ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా, ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను జోడించినట్టు తెలిపారు. దీని ద్వారా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులతో పాటు, ఉపాధి పొందేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై విధిగా సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు ఉపాధి కోర్సును ఓ పాఠ్యాంశంలా చదవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఫీజులను కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. స్టడీ మెటీరియల్‌ను స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థుల చిరునామాలకు పంపుతామని చెప్పారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఆర్ఓయూఆన్లైన్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇంటర్.. దానికి సమాన విద్యార్హతగల వారు డిగ్రీలో జాయిన్ కావచ్చునన్నారు. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్ అవకాశం కల్పించినట్టు తెలిపారు. 1999 తర్వాత అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు, 2005 తర్వాత అడ్మిషన్ తీసుకున్న పీజీ విద్యార్థులకు ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడానికి రీ అడ్మిషన్ ఇస్తున్నట్టు విజయకృష్ణారెడ్డి వివరించారు. -
మిర్యాల చంద్రయ్య ఇకలేరు.. పశువుల కాపరి నుంచి వైస్ చాన్సలర్ స్థాయికి..
సాక్షి, మన్యం పార్వతీపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పూర్వపు ఇన్చార్జి వైస్ చాన్సలర్, రూరల్ డెవలప్మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య (67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పశువుల కాపరిగా ప్రస్థానం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్యది విజయనగరం జిల్లా. పాలేరు కుమారుడిగా జీవితం ప్రారంభించి బాల్యంలో అనేక కష్టాలు పడ్డారు. పశువుల కాపరిగా పనిచేశారు. వసతి గృహల్లో చదువుకుని ఆంధ్రావిశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. 2008లో జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో పనిచేస్తున్న వారిలో 34 మంది ఏయూ మాతృ సంస్థకు వెళ్లిపోగా, ఐదుగురు మాత్రమే ఇక్కడ ఉండిపోయా రు. అందులో చంద్రయ్య ఒకరు. వర్సిటీలో విభాగా ధిపతిగా, ప్రిన్సిపాల్‌గా, చీఫ్ వార్డెన్‌గా అనేక బాధ్యతలు నిర్వహించారు. రెక్టార్ హోదాలో 2016 మే 14 నుంచి 2017 జూన్ 30 వరకు ఇన్చార్జి వైస్ చాన్సలర్‌గా వ్యవహరించారు. వీసీగా పనిచేస్తూనే రెగ్యులర్ గా తరగతులు బోధించేవారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించేవారు. సమయపాలన పక్కా.. చంద్రయ్య సమయ పాలన కచ్చితంగా పాటించేవారు. ఇన్చార్జ్ వీసీగా సమయంలో బోధకులు సమయపాలన పాటించకపోతే సహించేవారు కాదు. దీంతో బోధకు లు ఆయనపై తిరగబడ్డారు. మీరు వీసీనా.. వాచ్ మ్యానా..? అంటూ ప్రశించారు. తాను వర్సిటీకి వాచ్డాగ్ అంటూ సమాధానం ఇచ్చారు. సమయపాలన పాటించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల ఉత్తమ ఉపాధ్యా య విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఈయన మృతి పట్ల ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్రప్రసాద్, పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ప్రొఫెసర్ పీలా సుజాత సంతాపం తెలియజేశారు. -
ఏప్రిల్ 19న ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష
లాలాపేట: డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020–21 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరడానికి ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్షను (ఎలిజబిలిటీ టెస్టు) నిర్వ హించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, డా. పర్వతం వెంకటేశ్వర్లు, డా. బాల్‌రెడ్డి, సాయిబాబా, సత్యానందం తదితరులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేక పోయినా ఈ సంవత్సరం జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఈ పరీక్ష రాయవచ్చన్నారు. తెలంగాణ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఏప్రిల్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9959850497, 9000729590 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
జూన్ 2నుంచి ప్రాక్టీకల్ పరీక్షలు
కర్నూలు సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తృతీయ సంవత్సర డిగ్రీ సైన్స్ విద్యార్థులకు జూన్ 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రీజినల్ డైరెక్టర్ అజంతకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జువాలజీ 2నుంచి 4వ తేదీ వరకు, కెమిస్ట్రీ 4నుంచి 6 వరకు, ఫిజిక్స్ 7నుంచి 9వరకు, బోటని 10నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. -
చర్లపల్లి జైలులో ఓపెన్ వర్సిటీ పరీక్షలు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు ఇక్కడి ఖైదీల కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా జైలు, హైదరాబాద్ మహిళా జైలు, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు నుంచి దాదాపు 25 మంది ఖైదీలు వచ్చి ఇక్కడ పరీక్షలకు హాజరయ్యారు.