సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు.
సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి
భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్‌లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి గృహప్రవేశం
ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్‌లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి.
అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు.
వేగంగా నిర్మాణాలు
జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
– పి.ప్రశాంతి, కలెక్టర్
కల నిజమాయె..
పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్‌పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment