
సాక్షి, అమరావతి: హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ఈ నెల 30న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు.
న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్ కోర్టు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇందులో జస్టిస్ వెంకటేశ్వర్లు, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్ జ్యోతిర్మయి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలైన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ఈ నెల 27న విచారిస్తారు.