Emergency case
-
25 నుంచి 27 వరకు హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ఈ నెల 30న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్ కోర్టు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇందులో జస్టిస్ వెంకటేశ్వర్లు, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్ జ్యోతిర్మయి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలైన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ఈ నెల 27న విచారిస్తారు. -
‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం పిటిషన్ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా(పంజాబ్), అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు. సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’ అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చలమేశ్వర్‌ను సిబల్ కోరారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్ విజ్ఞప్తి చేశారు. 64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్ కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్‌ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్ కౌల్ సూచించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు. -
ఆ అంబులెన్స్‌లు కదలవు..
►కమీషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్‌లు ►గర్భిణీ రెఫర్ కేసులు 108 వాహనాల్లో తరలింపు ►అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్న 108 ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో దళారుల రాజ్యం నడుస్తోంది. వారి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రోత్సహిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ప్రభుత్వ ఖర్చులతోనే మెరుగైన చికిత్స కోసం కడప, ఇతర ప్రాంతాలకు పేద రోగులను తరలించాల్సి ఉంది. బాధితులే ఖర్చులు భరించగా గతంలో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపించేవారు. అయితే కొన్నినెలల నుంచి తిరుపతి, కర్నూలుకు అనుమతించడం లేదు. కేవలం కడప వరకు మాత్రమే బాధితులు డీజల్ ఖర్చులు భరించి ఆస్పత్రిలోని ప్రభుత్వ అంబులెన్స్‌లను తీసుకొని వెళ్తున్నారు. కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపడం లేదని కొందరు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇటీవల ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి సలహామండలి సమావేశానికి వచ్చిన కలెక్టర్ కర్నూలు, తిరుపతికి కూడా అంబులెన్స్‌లను అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఎందుకో మరి అధికారులు కలెక్టర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు. దీంతో అత్యవసర సమయంలో బాధితులు ప్రైవేట్ వాహనాల్లో రూ.వేలు ఖర్చు చేసుకొని ఇతర ప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల పాత్ర పోషించి ప్రైవేట్ వాహనాలను ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడప రిమ్స్‌కూ వెళ్లని అంబులెన్స్‌లు నిబంధనల ప్రకారం అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రి ఖర్చులతోనే అంబులెన్స్‌ల్లో కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నడూ ఆస్పత్రి నిధులను వెచ్చించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నుంచి 108 వాహనాల్లో గర్భిణీలను కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లొచ్చనే ఆదేశాలు వచ్చాయి. 108 వాహనం ఇక్కడి నుంచి ఖాజీపేట వరకు వెళ్తే అక్కడి నుంచి ఖాజీపేట ప్రాంతానికి చెందిన వాహనంలో కడపకు వెళ్లేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రికి చెందిన ప్రతి గర్భిణీ కేసు 108 వాహనంలోనే కడపకు తీసుకొని వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ 24గంటలు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలి. కానీ రాత్రి సమయాల్లో మాత్రం చాలామంది డాక్టర్లు ఆస్పత్రిలో ఉండటం లేదని సిబ్బంది అంటున్నారు. అత్యవసర కేసు ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్ ఆస్పత్రికి రాకుండానే కడపకు రెఫర్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్నాం.. జిల్లా ఆస్పత్రి నుంచి ఖాజీపేట వరకు 108 వాహనం వెళ్లి రావాలంటే సుమారు 2 గంటలు పడుతుంది. ఈ రెండు గంటల్లో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల నుంచి కనీసం రెండు అత్యవసర కేసుల ఫోన్లు వస్తాయని 108 సిబ్బంది చెబుతున్నారు. కడప రిమ్స్‌కు వెళ్లడం వల్ల ముఖ్యమైన కేసులకు వెళ్లలేకపోతున్నామని వా రు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్‌లు ఉన్ననూ తమకే ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు చేస్తున్నారని వారు చెబుతున్నారు.