ఆ అంబులెన్స్‌లు కదలవు..
►కమీషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్‌లు
►గర్భిణీ రెఫర్ కేసులు 108 వాహనాల్లో తరలింపు
►అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్న 108
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో దళారుల రాజ్యం నడుస్తోంది. వారి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రోత్సహిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ప్రభుత్వ ఖర్చులతోనే మెరుగైన చికిత్స కోసం కడప, ఇతర ప్రాంతాలకు పేద రోగులను తరలించాల్సి ఉంది. బాధితులే ఖర్చులు భరించగా గతంలో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపించేవారు. అయితే కొన్నినెలల నుంచి తిరుపతి, కర్నూలుకు అనుమతించడం లేదు. కేవలం కడప వరకు మాత్రమే బాధితులు డీజల్ ఖర్చులు భరించి ఆస్పత్రిలోని ప్రభుత్వ అంబులెన్స్‌లను తీసుకొని వెళ్తున్నారు.
కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపడం లేదని కొందరు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇటీవల ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి సలహామండలి సమావేశానికి వచ్చిన కలెక్టర్ కర్నూలు, తిరుపతికి కూడా అంబులెన్స్‌లను అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఎందుకో మరి అధికారులు కలెక్టర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు. దీంతో అత్యవసర సమయంలో బాధితులు ప్రైవేట్ వాహనాల్లో రూ.వేలు ఖర్చు చేసుకొని ఇతర ప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల పాత్ర పోషించి ప్రైవేట్ వాహనాలను ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కడప రిమ్స్‌కూ వెళ్లని అంబులెన్స్‌లు
నిబంధనల ప్రకారం అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రి ఖర్చులతోనే అంబులెన్స్‌ల్లో కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నడూ ఆస్పత్రి నిధులను వెచ్చించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నుంచి 108 వాహనాల్లో గర్భిణీలను కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లొచ్చనే ఆదేశాలు వచ్చాయి. 108 వాహనం ఇక్కడి నుంచి ఖాజీపేట వరకు వెళ్తే అక్కడి నుంచి ఖాజీపేట ప్రాంతానికి చెందిన వాహనంలో కడపకు వెళ్లేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రికి చెందిన ప్రతి గర్భిణీ కేసు 108 వాహనంలోనే కడపకు తీసుకొని వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ 24గంటలు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలి. కానీ రాత్రి సమయాల్లో మాత్రం చాలామంది డాక్టర్లు ఆస్పత్రిలో ఉండటం లేదని సిబ్బంది అంటున్నారు. అత్యవసర కేసు ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్ ఆస్పత్రికి రాకుండానే కడపకు రెఫర్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్నాం..
జిల్లా ఆస్పత్రి నుంచి ఖాజీపేట వరకు 108 వాహనం వెళ్లి రావాలంటే సుమారు 2 గంటలు పడుతుంది. ఈ రెండు గంటల్లో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల నుంచి కనీసం రెండు అత్యవసర కేసుల ఫోన్‌లు వస్తాయని 108 సిబ్బంది చెబుతున్నారు. కడప రిమ్స్‌కు వెళ్లడం వల్ల ముఖ్యమైన కేసులకు వెళ్లలేకపోతున్నామని వా రు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్‌లు ఉన్ననూ తమకే ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు చేస్తున్నారని వారు చెబుతున్నారు.