AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్‌ | E Content For Nadu Nedu First Phase Schools In AP | Sakshi
Sakshi News home page

AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్‌

Published Fri, Oct 7 2022 11:02 AM | Last Updated on Fri, Oct 7 2022 11:02 AM

E Content For Nadu Nedu First Phase Schools In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధనా కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్‌) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది.
చదవండి: లాస్ట్‌ జర్నీ.. లాస్ట్‌ సెల్ఫీ.. కన్నీరు పెట్టించిన ఫొటోలు, వీడియోలు

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్‌ ద్వారా ఈ కంటెంట్‌ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్‌ ల్యాబ్‌లకు ఈ–కంటెంట్‌ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్‌లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్‌లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌ల్లో డిజిటల్‌ డివైస్‌లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్‌ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది.

డిజిటల్‌ తరగతులకు సన్నాహాలు
మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్‌ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయనున్నారు.

రెండో దశ కింద  2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్‌ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్‌ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్‌ బ్యాండ్, లీజ్డ్‌ లైన్, టెలిఫోన్‌ లైన్‌ విత్‌ మోడెమ్, యూఎస్‌బీ మోడెమ్, పోర్టబుల్‌ హాట్‌స్పాట్, వీఎస్‌ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement