
కారులోనే ఉండిపోయిన వెంకట రమణ
సాక్షి, కాకినాడ : తనకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో.. ఇంట్లో తల్లికి, పసి పిల్లలకు తన వలన ఇబ్బంది కలగకూడదని భావించి.. ఒక రాత్రంతా కారులోనే ఉండిపోయిన వ్యక్తి పట్ల కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మానవత్వంతో స్పందించారు. అధికారులను అప్రమత్తం చేసి, ఆ వ్యక్తికి ఐసోలేషన్ కేంద్రంలో బెడ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. రాజోలు మండలానికి చెందిన గెద్దాడ వెంకటరమణ ఆయాసం వస్తూండడంతో సోమవారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని చెప్పిన వైద్యులు ఐసోలేషన్ కిట్ అందజేసి, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
అయితే వెంకటరమణ ఇంట్లో ప్రత్యేక గది, ప్రత్యేక బాత్‌రూము సదుపాయాలు లేవు. పైగా ఇంట్లో వృద్ధురాలైన తల్లి, చిన్న పిల్లలు ఉన్నారు. దీంతో తన వలన వారికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని భావించిన వెంకటరమణ.. కాకినాడలోనే బంధువుల ఇంటి సమీపాన.. వారందించిన మంచినీరు, ఆహారం తీసుకుని సోమవారం రాత్రంతా కారులోనే ఉండిపోయారు. ఈ విషయం ‘సాక్షి’ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ తక్షణం స్పందించారు. బాధితుడికి జేఎన్‌టీయూకే ఐసోలేషన్ కేంద్రంలో బెడ్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఆయనకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన పలువురు కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment