మొబైల్ థియేటర్ లోపల సీట్లు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాత పద్ధతులకు కొత్త హంగులు అద్దితే అది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్లకు కూడా ఆ కళ వచ్చింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలు ఎక్కువగా టూరింగ్ టాకీస్‌ల్లో నడిచేవి. ఇప్పుడు అదే తరహాలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఆధునిక హంగులతో సరికొత్త థియేటర్లు సిద్ధమవుతున్నాయి. మల్టీప్లెక్స్ హంగులు కల్పిస్తూ.. ఎక్కడకి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించగలిగే సినిమా థియేటర్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సిద్ధం చేస్తున్నారు.
చదవండి: నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
ఇక్కడి జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్‌కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ మొబైల్ థియేటర్‌ను ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 23న థియేటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి చైతన్య తెలిపారు. అయితే తొలి ప్రదర్శన మాత్రం 29న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం కానుందని చెబుతున్నారు.
ప్రత్యేకతలు ఇవీ..
గాలిని నింపే బెలూన్ల వంటి షీట్లను అమర్చి ఓ షామియానా (టెంట్) మాదిరి మొబైల్ థియేటర్‌ను తయారు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకునే టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 120 సీట్ల సామర్థ్యం ఉంటుంది. బయట నుంచి చూస్తే గాలి నింపుకుని కలర్ ఫుల్‌గా ఉన్న ఓ సెట్టింగ్‌లా ఈ థియేటర్ కనిపిస్తుంది. సులువుగా తరలించేందుకు వీలుగా ఈ థియేటర్ తయారీలో ప్లాస్టిక్, స్పాంజ్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. ఓ ట్రక్కులో దీనిని తరలించవచ్చు. ఇటీవలే తెలంగాణలోని ఆసిఫాబాద్‌లో ఈ తరహా థియేటర్‌కు శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment