
సాక్షి, విజ్జేశ్వరం: అన్నదాతలకు అండగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఖరీఫ్ సాగుకు ముందస్తుగా గోదావరి సాగునీరు విడుదల చేశారు. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం దగ్గర డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా కాలువ సాగునీరు విడుదల చేశారు. తద్వారా 5.29 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టారు జలవనరుల శాఖ మంత్రి అంబటి.
చంద్రబాబు తెలివితక్కువతనం వల్లే..
‘‘2018 నాటికి పోలవరం పూర్తి చేసేసి నీళ్లు ఇస్తానన్న చంద్రబాబు, దేవినేని ఉమా.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. పోలవరంలో డయాఫ్రం వాల్ దెబ్బతింది. కాపర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. ఈ తెలివితక్కువ పని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. డయాఫ్రం వాల్ రిపేర్ చేయాలా? లేదంటే పునర్నిర్మించాలా? అనే విషయంపైనే ఇప్పుడు ఇరిగేషన్ నిపుణులు ఆలోచిస్తున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో కచ్చితంగా జాప్యం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. పోలవరం ఫలానా డేట్ కు పూర్తవుతుందని స్పష్టంగా చెప్పలేము. త్వరిత గతిన పూర్తి చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Comments
Please login to add a commentAdd a comment