ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఈసీ గంగిరెడ్డి మృతి చెందడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులకు రానున్నారు. పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఇవాళ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పేదల డాక్టర్‌గా ఖ్యాతి పొందిన ఈసీ గంగిరెడ్డి మరణంతో పులివెందుల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతిపట్ల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డాక్టర్‌గానే కాక.. ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా ఆయన సేవలను విజయసాయి రెడ్డి గుర్తుచేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ట్విటర్ ఖాతాలో.. 'ప్రజాసేవకు ఈసీ గంగిరెడ్డిగారు ఒక చిరునామా. ఆయన మరణం బాధాకరం. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారాయన. ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఆయనకు సుస్థిరస్థానం ఉంది. ఆయనకు నా ఘన నివాళి' అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment