సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద చల్లేందుకు పత్రికా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ ఈనాడు పత్రిక మరోసారి దిగజారుడు రాతలకు దిగింది. వాస్తవాలను దాచిపెట్టి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మంగళవారం ‘చంద్రబాబుకు బాధలు చెబితే పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?’ అంటూ ఏలూరు జిల్లాలోని గోదావరి ముంపు గ్రామమైన వేలేరుపాడు గ్రామానికి చెందిన ఎర్రా వనజాకుమారి చెప్పినట్టు ఓ కథనాన్ని వండి వార్చింది.
చంద్రబాబుకు ఆమె బాధలు చెప్పుకుంటే పునరావాస కేంద్రం నుంచి ఖాళీ చేయాలని తహసీల్దార్ చెప్పారని, రెండు రోజులు గడువు అడిగినా వినలేదంటూ కథ అల్లింది. దీనికి టీడీపీ నేత చంద్రబాబు సైతం ‘గోడు చెప్పుకుంటే బెదిరింపులా?’ అంటూ.. వైఎస్సార్‌సీపీ నేతలను తప్పుబట్టడమే గాకుండా, వారికి రెవెన్యూ ఉద్యోగులు సైతం వంతపాడుతున్నారంటూ ట్విట్టర్‌లో పేర్కొనడం చూస్తుంటే.. ఏమీ లేనిచోట ఏదోవిధంగా బురద రాజకీయాలు చేయాలనే లక్ష్యంతో రాసినట్టుంది.
‘ఈనాడు’లో బాధితురాలిగా పేర్కొన్న ఎర్రా వనజాకుమారి తామే సహాయ శిబిరం నుంచి స్వయంగా వచ్చేశామని, అధికారులు ఎవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదని పేర్కొంటున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వరద ముంపు ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి తమ కుటుంబాన్ని ఎవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదని, తామే స్వచ్ఛందంగా అక్కడి నుంచి వచ్చేశామని వనజాకుమారి చెబుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. ‘ఎమ్మార్వో శిబిరం ఖాళీ చేయమని చెప్పలేదు. శిబిరంలో ఉండమనే చెప్పారు.
చంద్రబాబు వచ్చినప్పుడు నేను ఆయనతో మాట్లాడాక ఎవరో కొందరు మాతో గొడవపడ్డారు. మావల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని మేమే శిబిరం ఖాళీచేసి వచ్చేశాం. అధికారులు ఎవరూ మమ్మల్ని శిబిరం నుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదు’ అని ఆమె ఆ వీడియోలో వెల్లడించారు. దీంతో ఈనాడు రాసేవి దిగజారుడు రాతలని మరోసారి రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment