సాక్షి, అమరావతి: షరా మామూలుగానే రామోజీరావు మరోసారి సీఎం వైఎస్ జగన్‌పైనా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఈనాడు పత్రికలో ఓ పేజీ నిండుగా ఆయన ‘పచ్చ’పాతం చూపించారు. వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రోడ్ల అభివృద్ధికి ఎక్కువగా నిధులు వెచ్చించారు. అందులోనూ రెండేళ్లపాటు కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రోడ్ల నిర్మాణం, నిర్వహణ, పునరుద్ధరణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించి ఖర్చు చేసింది.
టీడీపీకి మేలు చేసేందుకు పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్న రామోజీరావు వాటిని తీసి చూస్తే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కనిపిస్తుంది. వాస్తవాలు తెలుస్తాయి. వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై గుంతలు పడడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు మునిసిపల్ అధికారులు పరిశీలించడం.. సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూడ్చి అందుబాటులోకి తేవడం పరిపాటి. నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియపైనా ఈనాడు పత్రిక విషం కక్కింది.
పాత ఫొటోలను ‘నేడే జరిగింది’ అన్నట్టు అచ్చువేసి. పురపాలికల్లో గత కొన్నిరోజులుగా పాట్‌హోల్స్, రోడ్ల మరమ్మతులు చేయాల్సిన 29,908 గుంతలను గుర్తించారు. వీటిని రూ.30.18 కోట్ల నిధులతో మెరుగుపరిచారు. ఇప్పటిదాకా 25,611 (85.63 శాతం) పనులు పూర్తిచేయగా, మరో 4,158 (13.90 శాతం) పనులు జరుగుతున్నాయి. ఇక గుంటూరు, గుడివాడ, తాడిగడప మునిసిపాలిటీల్లోను పనులు పూర్తి చేసిన, జరుగుతున్న ప్రాంతాలపైనా ఈనాడు విషం కక్కింది.
వాస్తవాలు ఇవిగో..
♦ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 నుంచి 2019 సమయంలో ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ. 3,335.3౦ కోట్లు విలువైన పనులు చేసింది. అయితే రూ. 2,772.60 కోట్ల బిల్లులే చెల్లించింది. రూ. 562.7 కోట్లు పెండింగ్ పెట్టింది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రోడ్ల కోసం రూ. 471.15 కోట్ల పనులు చేసింది. వాటిలో కూడా రూ. 387.78 కోట్ల బిల్లులే చెల్లించి రూ. 86.37 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది. మొత్తంగా ఈ రెండు శాఖల పరిధిలో రూ. 3,160.38 కోట్లు ఖర్చు చేశారు.
♦ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలోనే ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ. 4,148.59 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్ బకాయిల్లోని రూ. 554.83 కోట్లతో పాటు ఈ ప్రభుత్వంలో చేసిన పనుల కోసం రూ. 3,593.76 కోట్లు విలువైన బిల్లులు చెల్లించింది. ఇక పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ. 344.4 కోట్ల పనులు చేసింది. టీడీపీ ప్రభుత్వం బకాయిల్లో రూ. 61.83 కోట్లను కూడా చెల్లించింది. మొత్తంగా ఈ రెండుశాఖల పరిధిలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 4,492.99 కోట్లు ఖర్చు చేసింది.
♦మరో ఆర్థిక సంవత్సరం మిగిలి ఉండగానే నాలుగేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన కంటే రూ. 1,332 కోట్లు అధికంగా ఖర్చు చేసింది.
♦వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్‌అండ్‌బీ పరిధిలో దాదాపుగా 11,500 కి.మీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో దాదాపు 1,394.34 కి.మీ., మొత్తంగా 12,894 కి.మీ మేర రోడ్లకు మరమ్మతులు చేసింది.
♦ ఇవి కాకుండా మునిసిపల్ శాఖ పరిధిలో పెద్దమొత్తంలో రోడ్లకు మరమ్మతులు నిర్వహించారు.
♦ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య ఐదేళ్ల కాలంలో 3,507 కిలో మీటర్ల పొడవున కొత్తగా తారు రోడ్లను నిర్మిస్తే.. ప్రస్తుత వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలోనే 5,374 కిలో మీటర్ల కొత్త తారు రోడ్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ పరిధిలో మొత్తం 27,141 కిలో మీటర్ల పొడవున తారు రోడ్లు ఉండగా, అందులో మరమ్మతులు అవసరమైన చోట తక్షణం నిధులు మంజూరు చేసి పనులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment