సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి నిత్యం తప్పుడు కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా న్యాయస్థానాల్లో జరిగే కేసుల ప్రొసీడింగ్స్ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు అవినీతిని ఆపాదిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ‘పిల్’పై విచారణ సందర్భంగా హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్‌ను వక్రీకరించి ‘ఈనాడు’ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. కోర్టులో జరిగింది, ధర్మాసనం తేల్చి చెప్పింది ఒకటైతే అందుకు విరుద్ధంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసింది.
న్యాయవర్గాల్లో విస్మయం
‘సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు’ అనే శీర్షికతో ఈనాడు శుక్రవారం ప్రచురించిన కథనంపై న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రఘురామ పిల్ విచారణార్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటూ కోర్టు నోటీసులు ఇస్తే.. కేసు లోతుల్లోకి వెళ్లి నోటీసులు ఇచ్చారనే అర్థం వచ్చేలా ఈనాడు కథనాన్ని వెలువరించింది. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడాన్ని ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంలో తనపై ఉన్న కేసుల గురించి, ఎంపీ అనర్హతకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు అందిన ఫిర్యాదు గురించి పేర్కొనకపోవడాన్ని కూడా ఏజీ ప్రస్తావించారు.
రుణ సంస్థలకు రూ.వందల కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల పట్ల ఎలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఆయనకున్న దురుద్దేశాలను స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ విశ్వసనీయతను ఏజీ ప్రశ్నించారు. తొలుత ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేల్చాలని ఏజీ పట్టుబట్టారు.
తేల్చిన తరువాతే తదుపరి అడుగులు..
పిల్ విచారణార్హత విషయంలో ఏజీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో హైకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందింది. రఘురామ వ్యాజ్యం విచారణార్హతపైనే ముందుగా తేల్చాలని నిర్ణయించింది. అందుకే వాదనల సందర్భంగా ధర్మాసనం పదేపదే ‘విచారణార్హత’ గురించే ప్రస్తావించింది. ఈ పిల్‌ను విచారణకు సైతం స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది. విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొంది. ప్రతివాదులకు ఎందుకు నోటీసులు ఇస్తున్నామనే విషయాన్ని కూడా ధర్మాసనం చాలా స్పష్టంగా వివరించింది.
విచారణార్హతపై ప్రతివాదులందరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని సూచించింది. న్యాయస్థానం తమకు ఈ పిల్ విచారణార్హతపై వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని భవిష్యత్తులో ఎవరూ అనకుండా అందరికీ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం ఇస్తున్నామని ఇరు పక్షాలకు చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పింది. అందరి అభ్యంతరాలను విని విచారణార్హతను తేల్చి న తరువాతే కేసు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది. అయితే ఈనాడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తన మొత్తం కథనంలో ‘విచారణార్హత’ గురించి నామమాత్రంగానే ప్రస్తావించింది.
రఘురామ చేసిన ఆరోపణలకు స్పందించి కేసు లోతుల్లోకి వెళ్లి మరీ హైకోర్టు నోటీసులు జారీ చేసిందన్నట్లుగా కథనాన్ని ప్రచురించింది. రఘురామ ఆరోపణలకు తన ఉద్దేశపూర్వక కథనంలో ప్రాముఖ్యతనిచ్చిన ఈనాడు విచారణార్హతపై ఏజీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను మాత్రం నామమాత్రంగానే ప్రస్తావించింది. వాస్తవానికి రఘురామ ఆరోపణల జోలికి ఇప్పుడు వెళ్లే అవకాశం లేదని కోర్టు చెప్పినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు న్యాయస్థానం ఆదేశాలను ఈనాడు వక్రీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment