ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు?  | Eenadu Ramoji rao Fake News On CM Jagan Govt Obulapuram Mining | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు? 

Published Wed, Aug 24 2022 2:59 AM | Last Updated on Wed, Aug 24 2022 9:29 AM

Eenadu Ramoji rao Fake News On CM Jagan Govt Obulapuram Mining - Sakshi

ప్రతి రోజూ కొంత విషం!. ఒకో రోజు కాస్త ఎక్కువ డోసు!!. మొత్తానికి ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి... అసత్యాలు, అతిశయోక్తులతోనైనా జనంలో ఎంతోకొంత వై.ఎస్‌.జగన్‌ సర్కారుపై వ్యతిరేకత నింపాలన్నదే రామోజీరావు అత్యాశ. ఆ మేరకు తన ఆత్మబంధువు చంద్రబాబు నాయుడిని కొంతైనా పైకి లేపాలన్నది ఆయన పరమోద్దేశం. అందుకే ‘ఈనాడు’లో ఏ కథనం రాసినా దాని దృష్టి వేరు.. ప్రయోజనాలు వేరు. బయటకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నట్లు కనిపిస్తున్నా... అడుగడుగునా వక్రీకరణలే. టార్గెట్‌ జగన్‌ మాదిరిగా సాగిపోవాల్సిందే.

మంగళవారం వండివార్చిన ‘ఓబుళాపురం మైనింగ్‌ లీజుల్లో అక్రమాలు’ కూడా అంతే!!. 2009లోనే మైనింగ్‌ ఆగిపోయిన ఈ గనుల గురించి అసలిప్పుడెందుకు రాసినట్లు? అక్కడ గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారని... ఇదంతా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ వేసిన నేపథ్యంలోనే జరిగిందంటూ బోడిగుండుకు– అరికాలుకు లింకు పెడుతూ రాసి పారేశారు రామోజీ. ఏ కాస్త ఇంగితజ్ఞానం... తన వృత్తిపట్ల కనీస జవాబుదారీతనం ఉన్నవారెవరూ ఇలాంటి రాతలు రాయరు గాక రాయరు. పచ్చి అబద్ధాలను అచ్చేయరు. ఓబుళాపురం గనుల విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో, వాస్తవంగా ఏం జరుగుతోందో... ‘ఈనాడు’ ఎలా భ్రష్టు పట్టించాలని చూస్తోందో చెప్పేదే ఈ ‘ఏది నిజం?’ 

ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాల్లో గతంలో చెలరేగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే అక్కడ అత్యంత పారదర్శకంగా మైనింగ్‌ కార్యకలాపాలు జరిపించడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వమే మైనింగ్‌ చేస్తే ఏ గొడవా ఉండదన్న ఉద్దేశంతో... ఏపీఎండీసీకి ఆ లీజులను రిజర్వు చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కేంద్ర గనుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీఎండీసీ ద్వారా ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, దాన్ని కడప ఉక్కు ఫ్యాక్టరీకి ముడి ఖనిజంగా రవాణా చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు.

రెండురోజుల కిందట కూడా ప్రధానిని కలిసినపుడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించాలని కోరారంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు రావటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుందని... అనేక ఆరోపణలున్న ఇనుప ఖనిజం లీజుల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా, పారదర్శకంగా మైనింగ్‌ జరుగుతుందని భావిస్తున్నారు. ‘ఈనాడు’ రామోజీరావు మాత్రం అసలు ఈ గనులే తెరుచుకోకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు బురద కథనాలను అచ్చేస్తున్నారు. అదీ తేడా!. 

పరిమితి ముగిసిన లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలనడం తప్పా? 
ఓబుళాపురం ప్రాంతంలో 6 ఐరన్‌ ఓర్‌ లీజులను 1956 నుంచి 2007 వరకు వివిధ దశల్లో అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆరోపణలు రావటంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ లీజులన్నిటినీ సస్పెండ్‌ చేసింది. బళ్ళారి ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 27.12 హెక్టార్లలో 1956లో, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి 25.98 హెక్టార్లలో 1964లో, అనంతపురం మైనింగ్‌ కంపెనీకి 6.5 హెక్టార్లలో 1956లో లీజులు మంజూరు చేశారు. వీటి గడువు 2020 మార్చి 31తో ముగిసిపోయింది. లీజు ముగిసిన వెంటనే ఈ గనులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని కోరుతూ 09.10.2019నే కేంద్ర గనుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇదే విషయమై 2022 జనవరి 3న ప్రధాని మోదీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ అభ్యర్థించారు కూడా. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 3న ఈ 3 లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి రాష్ట్రం తరఫున మరోసారి లేఖ రాశారు. ఈ వాస్తవాల్లో ఒక్కటి కూడా ఎన్నడూ ప్రస్తావించని ‘ఈనాడు’... పదేపదే ఈ లీజులను కావాల్సిన వారికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచార ఎజెండాను కొనసాగిస్తోంది.  


సుప్రీంలో కేసు... అంతిమ తీర్పును బట్టే ఏదైనా! 
ఓబుళాపురం గనులకు సంబంధించి గతంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ సమయంలోనే... కాలపరిమితి ముగిసిన మూడు ఇనుప ఖనిజం లీజులను... అన్ని అర్హతలూ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజులు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ప్రభుత్వం అఫిడవిట్‌ వేసింది. ఇప్పటికే ఈ ప్రాంత గనులకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ధేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను కూడా ఏర్పాటు చేసింది.

అదే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని, అన్ని అర్హతలూ ఉన్నవారికి కేంద్ర నిబంధనల ప్రకారం లీజులు జారీ చేయటానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వోకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ను అభ్యర్థించింది. ఇదేమైనా తప్పా? ఈ వివాదం పరిష్కారమైతే మూడు గనులకూ లీజులు జారీ అవుతాయి. దాంతో రాష్ట్రానికి కొంత రాయల్టీ.. కొందరికి ఉద్యోగాలు వస్తాయన్నదే ఏ ప్రభుత్వమైనా భావించేది. ఇదంతా తప్పంటే ఎలా రామోజీరావు గారూ? 

ఇదీ మిగిలిన 3 లీజుల పరిస్థితి... 
ఇవి కాకుండా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి 2007 జూన్‌ 19న 39.48 హెక్టార్లు, 68.50 హెక్టార్లలో రెండు లీజులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి కాలపరిమితి 2057 జూన్‌ 18 వరకు ఉంది. వై.మహాబలేశ్వరప్ప అండ్‌ సన్స్‌కు 1978 జనవరి 12న 20.240 హెక్టార్లలో మరో లీజు మంజూరు చేశారు. దీని కాలపరిమితి 2028 జనవరి 11 వరకు ఉంది. ఈ మూడు లీజులు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాయి. గతంలో చంద్రబాబు– రామోజీరావు కలిసి నడిపించిన కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ఈ లీజులను సస్పెండ్‌చేశారు. కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కిరణ్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా... ఆ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వమేం చేస్తుంది? ఈ 3 లీజులకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. నిజానికి ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. అంతకన్నా ప్రత్యామ్నాయం కూడా ఉండదు. కానీ రామోజీ మాత్రం ఇంకా కోర్టు తీర్పు రాకముందే శివాలెత్తిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వకుండానే... ప్రభుత్వం ఎవరెవరికో లీజులిచ్చేయడానికి ప్రయత్నిస్తోందంటూ చేతికొచ్చిన రాతలు రాస్తున్నారు. ఇవన్నీ చూస్తే వయసు ప్రభావంతో ఈయన మానసిక స్థితి ఏమైందోనన్న అనుమానం రాకమానదు. 

అమికస్‌ క్యూరీ నివేదిక అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాతలు  
విచారణ నేపథ్యంలో... ఓబుళాపురం ప్రాంతంలో గతంలో జరిగిన అక్రమాలపై తాజాగా అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించారు. కానీ రామోజీ దాన్ని వక్రీకరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ నేపథ్యంలోనే అమికస్‌ క్యూరీ తన నివేదికను సమర్పించినట్లు అడ్డగోలు రాతలు రాశారు. ఈ గనులను కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆయనకు కనిపించటమే లేదు. అదే ఈ రాష్ట్ర దౌర్భాగ్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement