విషం కక్కిన ‘ఈనాడు’.. వక్రీకరణే వజ్రాయుధమా?.. | Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan | Sakshi
Sakshi News home page

విషం కక్కిన ‘ఈనాడు’.. వక్రీకరణే వజ్రాయుధమా?..

Published Mon, Sep 26 2022 4:12 AM | Last Updated on Mon, Sep 26 2022 7:03 AM

Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan - Sakshi

అనంతపురంలో లేపాక్షి భూములు

వార్త ఏదైనా వక్రీకరణే ప్రధానం. ఇదీ... రామోజీరావు తాజా సూత్రం. ప్రత్యేక కథనం కావచ్చు... న్యాయస్థానం వ్యాఖ్యలు కావచ్చు... న్యాయ ప్రక్రియ కావచ్చు... ఆఖరికి ఎవరిదైనా ఇంటర్వ్యూ కావచ్చు. దానికి సొంత వ్యాఖ్యానాలు జోడిస్తూ... టార్గెట్‌ వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అంటూ విషం కక్కడమే ఆయన ధ్యేయం. తన పత్రికలో కాలమిస్టుగా వ్యాసాలు రాసే బ్యాంకింగ్‌ రంగ  నిపుణుడు కె.నరసింహమూర్తి ఇంటర్వ్యూను ఆదివారం నాడు పనిగట్టుకుని పతాక శీర్షికల్లో వేయటం కూడా అలాంటి రాజకీయ ఎజెండాలో భాగమే. ఆయన చెప్పిన విషయాలకు... తన సొంత వ్యాఖ్యానం జోడిస్తూ ‘ఇందూ సంస్థ తాకట్టుపెట్టిన ఆస్తులన్నింటినీ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ కుమారుడు నరేన్‌ రామానుజుల రెడ్డి డైరెక్టరుగా ఉన్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్ ఇటీవల రూ.500 కోట్లకే పొందేందుకు ప్రయత్నించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది’’ అని పేర్కొనటం... ఆ కుట్రలో ఓ ప్రధానాంకం. 

జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికి హద్దులే లేనట్లుగా నానాటికీ దిగజారిపోతున్న రామోజీ రావుకు తనలానే తన కుట్రలకూ వయసు మళ్లిందనే విషయం అర్థంకావటం లేదనే అనుకోవాలి. ‘ఇందూకు విందు’ అంటూ గతనెల్లో పేజీలకు పేజీలు వండేసిన ‘ఈనాడు’... ఆ ఆస్తులన్నీ ఎన్‌సీఎల్‌టీ బిడ్డింగ్‌లో ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ చౌకగా కొట్టేసిందని, అందులో వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి మేనమామ కుమారుడు డైరెక్టరని, ఇదంతా పథకం ప్రకారం జరిగిందని రాసి పారేసింది. దానిపై పయ్యావుల కేశవ్‌ వంటి తెలుగుదేశం నేతలనూ మాట్లాడించేసి... మొత్తంగా అదో కుంభకోణమనే రీతిలో బురద జల్లటానికి ప్రయత్నించింది. కానీ ఏం జరిగింది? ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ ఇప్పటికీ డబ్బులు పూర్తిగా చెల్లించలేకపోయింది. గడువు ముగిసినా చెల్లింపులు పూర్తి చేయలేదు కాబట్టి బిడ్డింగ్‌ను మళ్లీ నిర్వహిస్తామని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంటోంది. అంటే దీనర్థమేంటి రామోజీరావు గారూ? 

మీరు చెబుతున్నదే నిజమైతే వేల కోట్ల విలువైన ఆస్తులను రూ.500 కోట్లకే దక్కించుకున్న ఎర్తిన్‌ సంస్థ డబ్బులు ఎందుకు చెల్లించలేకపోయింది? 

వేల కోట్ల విలువైన ఆస్తులు అంత చౌకగా వస్తున్నపుడు ఆ ఎర్తిన్‌ సంస్థ పిలిచినా ఇన్వెస్టర్లెవరూ ముందుకు రాలేదెందుకు? 

అసలు మీరెందుకు బిడ్లు వేయలేదు? మీరో మీ తెలుగుదేశం స్నేహితులో బిడ్లు వేయొచ్చుగా? అంతే చౌకగా కొట్టేయొచ్చుగా? ఎవరు ఆపారు మిమ్మల్ని? 

పోనీ ఇప్పుడు మీరు రాస్తున్నట్లుగానే మళ్లీ ఎన్‌సీఎల్‌టీ బిడ్లు పిలిస్తే మీరు ఒంటరిగానో లేక మీ దోచుకో–పంచుకో – తినుకో(డీపీటీ) భాగస్వాములతో కలిసో టెండర్లు వేస్తారా?  

వీటికి మీ దగ్గర సమాధానాలున్నాయా రామోజీరావు గారూ!!? 

దగుల్బాజీ, దౌర్భాగ్యపు రాతలు కాక వీటినేమనాలి? టెండర్లలో ఎవరూ పాల్గొనకుంటే అప్పుడో రకం రాతలు. ఎవరో ఒకరు దక్కించుకుంటే మరో రకం రాతలు. ఎందుకిదంతా? అసలు లేపాక్షి సంస్థకు ఆ భూముల్ని తనఖా పెట్టుకోవచ్చని ఏపీఐఐసీ నిరభ్యంతరపత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చింది ఎప్పుడు? నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణించిన తరవాత కాదా? ఆ విషయాన్ని ఎందుకు రాయరు? లేపాక్షికిచ్చిన భూముల్లో దాదాపు సగం భూముల్ని ఇచ్చింది కూడా వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మరణించాకేనన్నది నిజం కాదా? మరణించాక జరిగిన పరిణామాలను కూడా దివంగత నేత వైఎస్సార్‌కో, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికో అంటగడుతూ కథనాలు రాయటం ఏ స్థాయి పాత్రికేయం?  

‘అసైన్డ్‌’కు అంత ధర ఎప్పుడైనా ఇచ్చారా? 
ఏ ప్రభుత్వమైనా కంపెనీలకు భూములిచ్చేది ఆ ప్రాంత అభివృద్ధి కోసమే. అందుకే అక్కడున్న మార్కెట్‌ ధరకు కేటాయించటం రివాజు. లేపాక్షి వ్యవహారంలోనూ అంతే. అప్పట్లో అక్కడున్న మండలాల్లో ఎకరా రూ.20–30 వేలకన్నా ఎక్కువ పలకటం లేదని స్థానిక అధికారులు నివేదిక సైతం ఇచ్చారు. అయినా ప్రభుత్వం తన భూములకు ఎకరాకు రూ.50వేలు, రైతుల నుంచి తీసుకునే అసైన్డ్‌ భూములకు మాత్రం అంతకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా... ఎకరా రూ.1.75 లక్షల చొప్పున నిర్ణయించింది.

రైతుల కోసం మీ చంద్రబాబు ఇలా ఒక్కరోజైనా ఆలోచించారా? అసలు చంద్రబాబు హయాంలో అసైన్డ్‌ భూములు లాక్కున్నపుడు రైతులకు చెల్లించిన ధర ఎంత? దీన్ని ఏనాడైనా మీరు ప్రశ్నించారా? మరి మీది పాత్రికేయమంటారా? వైఎస్సార్‌ గనక మరణించకుండా ఉంటే అక్కడి ప్రాజెక్టు సాకారమై కొన్ని వేల మందికి ఉపాధి దొరికి ఉండేది కాదా? దురదృష్టవశాత్తూ ఆయన మరణించాక జరిగిన సంఘటనలతో ఆయనకు ఏం సంబంధం? ఆయనే ఏదో తప్పు చేశారనే భ్రమ కలిగించేలా ఇంకెన్నాళ్లీ నీచపు రాతలు? 

ఎన్‌సీఎల్‌టీ మీ పెరట్లోని చిట్‌ఫండ్‌ సంస్థా? 
జాతీయ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఓ చట్టబద్ధ సంస్థ. అది చేపట్టే ప్రక్రియలోనూ రంధ్రాలు వెదికి... అదేదో కావాలని చౌకగా కట్టబెట్టేసినట్లు అపోహలకు తావిచ్చే కథనాలు వండటం ఎంత వరకూ సమంజసం రామోజీరావు గారూ? అదేమీ మీ పెరట్లోని చిట్‌ఫండ్‌ సంస్థ కాదు కదా? ఫలానా కంపెనీ పరిష్కార ప్రక్రియ కోసం బిడ్లు పిలుస్తున్నామని అది పత్రికల్లో ప్రకటనలిచ్చి బహిరంగంగా బిడ్లు పిలిచినపుడు మీరెందుకు పాల్గొనలేదు? పాల్గొని దక్కించుకున్నవారిపై ఇలా దిగజారుడు కథనాలు రాయటం ఎంతవరకూ సమంజసం? అసలు ఎన్‌సీఎల్‌టీ బిడ్లలో తామూ పాల్గొంటామని వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వమే ఎన్‌సీఎల్‌టీ పరిష్కార నిపుణుడికి లేఖ రాసింది.

కానీ గడువు ముగిసిందంటూ ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. దీన్నిబట్టి ఆ భూములు కాపాడటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం అర్థంకావటం లేదా? ఈ భూముల కేటాయింపును రద్దుచేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు పక్కనబెట్టకుండా పెండింగ్‌లో ఉంచింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు నాయుడు దీనికి కౌంటర్‌ వేయకుండా నానుస్తూనే వచ్చారు.

మీరు కూడా ఒక్కటంటే ఒక్క అక్షరాన్ని కూడా వృథా చేయలేదు. ఎందుకంటే బాబు ఏం చేసినా మీ మేలు కోసమే గదా మరి!!. ప్రస్తుత ప్రభుత్వమే దీనికి కౌంటర్‌ దాఖలు చేస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది కనక అది తేలేదాకా బిడ్డింగ్‌ ప్రక్రియ నుంచి ఈ భూముల్ని మినహాయించాలని తాజాగా ఎన్‌సీఎల్‌టీని కూడా కోరింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. మీరు మాత్రం ఇప్పుడే ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా శివాలెత్తటం చిత్రాతిచిత్రం. 

2008లో చిలమత్తూరు మండలంలోని భూముల మార్కెట్‌ విలువ ఎకరా రూ.20వేల నుంచి రూ.74,500 మాత్రమే పలుకుతున్నట్లు చిలమత్తూరు సబ్‌రిజిష్ట్రార్‌ అధికారికంగా పేర్కొన్న అప్పటి పత్రాలివి. కోడూరులో ఎకరా రూ.24వేల నుంచి రూ.53వేల వరకూ ఉన్నట్లు అధికారులే పేర్కొనటాన్ని చూడొచ్చు.  

ఆ డీపీటీ ఇప్పుడు లేదనేగా? 
‘మంచిని చెప్పకు... వక్రీకరణ వదలకు’ అనే రీతిలో ప్రతిరోజూ రాజకీయ ఎజెండాతో చెలరేగిపోతున్న రామోజీ అండ్‌ కో లక్ష్యం ఒక్కటే. అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని తెచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టేయడం. ఎందుకంటే మూడేళ్లుగా వీరి దోపిడీకి... డీపీటీకి అడ్డుకట్ట పడింది. బాబు హయాంలో... నైపుణ్యాభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తామంటూ ‘ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌టీసీ) కేంద్రంగా భారీ కుంభకోణం చేసి డొల్ల కంపెనీల ద్వారా కొట్టేసింది రూ.241 కోట్లపైనే. ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో ఫేక్‌ సర్టిఫికెట్లు పెట్టిన కంపెనీలకు రాజమార్గంలో పంపించింది 321 కోట్లపైనే. ఇక ఇసుక ఉచితమంటూ మొత్తం నదులనే కబ్జా పెట్టారు.

వేలకోట్లు కొల్లగొట్టేశారు. సాక్షాత్తూ చంద్రబాబు ఇంటివెనకే రాత్రింబవళ్లూ లారీలకొద్దీ ఇసుక రవాణా అయ్యేదంటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. అక్రమాలకు అడ్డొచ్చారని మహిళా తహసీల్దారును టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టుకుని ఈడ్చేసినా ఒక్క వార్త ప్రసారం కాలేదు. మద్యం డిస్టిలరీలకు తన వారికే అనుమతులిచ్చి కోట్లు కొల్లగొట్టారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చి, బెల్టు షాపులు పెంచి... టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు పెంచారు. పెంచినందుకు ప్రోత్సాహకాలిచ్చారు.

ఇక అమరావతి కుంభకోణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క అసైన్డ్‌ భూముల వ్యవహారంలోనే పథకం ప్రకారం చంద్రబాబు, అతని అనుయాయులు 1,100 ఎకరాలు కొట్టేశారు. కాకపోతే వీటన్నిటిపై రామోజీరావుగానీ, ఆయన బృందంలోని ఏబీఎన్, టీవీ5 వంటివేవీ ఒక్క కథనాన్నీ వండి వార్చలేదు. ఎందుకంటే వారి వాటాలు వారికొచ్చాయి. ఇప్పుడు ఇసుక విషయంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు.. అంటే ఐదేళ్లలో దాదాపు 4వేల కోట్లు వస్తున్నా... దుష్టచతుష్టయం దృష్టిలో అదో ఘోరమైన తప్పిదమే.

కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి సబ్‌కాంట్రాక్టుకిచ్చేశారంటూ అదో ఘోరమైన నేరంలా బురద జల్లే కథనాలు దాదాపు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. మద్యం విక్రయాలు తగ్గించడానికి పర్మిట్ రూమ్‌లు రద్దు చేసి, బెల్టుషాపులు తీసేసినా తప్పే. బాబు అనుమతిచ్చిన డిస్టిలరీలే ఇప్పుడూ మద్యం సరఫరా చేస్తున్నా... నాసిరకమంటూ, పేరులేని బ్రాండ్లంటూ ప్రతిరోజూ తప్పుడు ప్రచారమే. అయినా... బాబు హయాంలో జరిగిన ఐఎంజీ లాంటి కుంభకోణాల్ని కూడా అందమైన చందమామ కథల్లా పాఠకులకు చెప్పిన చరిత్ర ‘ఈనాడు’ది. అలాంటి పత్రిక నుంచి ఇంతకన్నా మెరుగైన కథనాలెలా ఆశించగలం?? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement