కవల పిల్లల్లాంటి రామోజీరావు, చంద్రబాబునాయుడు ఎంత నిరాశా, నిస్పృహల్లో ఉన్నారంటే... తామేం చేస్తున్నామో తమకే తెలియనంత!. ఇది మనకు తెలియడానికి మంగళవారం నాటి ‘ఈనాడు’ పత్రిక మొదటిపేజీ చూస్తే చాలు. ఎందుకంటే ‘జగన్ ఏలుబడిలో ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు’ అంటూ ఓ బ్యానర్ కథనాన్ని వండిన ‘ఈనాడు’... ఆ విషయాన్ని ముందే చంద్రబాబుకు చెప్పటంతో బాబు హడావిడిగా ఓ వీడియో చేసి ట్విటర్లో పెట్టేశారు. ‘ఇది రాష్ట్రమా? రావణ కాష్టమా?’ అన్న చంద్రబాబు ట్విటర్ ప్రసంగాన్ని కూడా ‘ఈనాడు’ తన వార్త పక్కనే పెట్టింది.
కాకపోతే రాజధాని ప్రాంతంలో బలహీనవర్గాలకు ఇళ్లు రాకుండా అడ్డుకుంటూ తామెన్ని కుట్రలు చేసినా పారలేదన్న ఉక్రోషం ఈ కవలలిద్దరినీ కుదిపేస్తోంది. ఆ దుగ్దతో.. ‘ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై ఆమోదం’ అనే వార్తను కూడా అక్కడే వేయాల్సి వచ్చింది. ఇదిగో... ఇక్కడే ఈ ‘నారామోజీ’ కుట్ర పచ్చగా బయటపడింది. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లింది ఈ నారా వారి ముఠానే. అంటే.. అక్కడ దళితులు ఉండకూడదని కోర్టులకెక్కి న్యాయపోరాటం చేసింది వీరే.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దృఢ సంకల్పంతో వారి కుట్రల్ని అడ్డుకున్నారు. కింది నుంచి పైవరకూ కోర్టుల్లో పోరాడి మరీ... పేదలకు అనుకూలంగా ప్రభుత్వం గెలవగలిగింది. 51వేల మందికిపైగా పేదలకు ‘ఆర్–5’ జోన్లో ఇళ్ళ స్థలాలు కేటాయించింది. వాటిలో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ చొరవ తీసుకుని నేరుగా కేంద్ర పెద్దలను అభ్యర్థించి నిధులు సాధించారు. నిధులను అడ్డుకోవటానికి టీడీపీ, ఎంపీ రఘు రామకృష్ణరాజు కేంద్రానికి లేఖలు కూడా రాసినా... అవేవీ పనిచేయలేదు. సోమవారం కేంద్రం వీటికి ఆమోదం తెలియజేసింది.
ఎస్సీ, ఎస్టీల విషయంలో ఇది ప్రభుత్వ విజయం కాబట్టి... దాని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ‘ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు’ అంటూ రామోజీరావు తన పైత్యానికి పనిచెప్పారు. విధిలేక... తన అక్కసునంతా బయటపెట్టుకుంటూ... ‘ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై ఆమోదం’ అనే కథనాన్ని కూడా వేశారు. కాకపోతే ఆ కథనంలో కూడా... కేంద్రం ఇంత త్వరగా ఎందుకు అనుమతిచ్చింది? అసలు ఎందుకివ్వాలి? అనే రీతిలో తన బాధనంతా వ్యక్తంచేసింది. ఇది చాలు కదా.. దళితులు, పేదలు, బలహీనవర్గాలపై నిజంగా ఎవరికి మమకారం ఉందో చెప్పటానికి? ఎవరి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగిందో తెలియటానికి?
బాబు జమానా... భయంభయం
మాటల్లో అబద్ధాలుండొచ్చు. రామోజీ రాతల్లోనైతే ఇక చెప్పక్కర్లేదు. కానీ అంకెలు అబద్ధాలు చెప్పవు కదా!. చంద్రబాబు ప్రభుత్వ హయాంను తలచుకుంటే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఉలిక్కి పడతారో అప్పటి అఘాయిత్యాల గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. 2014–19 మధ్య దేశంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యధికంగా దాడులు జరిగిన టాప్–10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఎస్సీలపై దాడుల్లో ఏపీ 9వ స్థానమైతే... ఎస్టీలపై దాడుల్లో ఐదో స్థానం. దక్షిణాది రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన రాష్ట్రాల్లో ఏపీది 3వ స్థానం. అదీ.. ‘ఈనాడు’ రాయని చంద్రబాబు పాలన.
పెరిగిన భద్రత... తగ్గిన కేసులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ కేసులతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై కేసుల (పీఓఏ) శాతం తగ్గడం ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమనే చెప్పాలి. 2019లో మొత్తం ఐపీసీ కేసుల్లో పీఓఏ కేసులు 1.7 శాతమే ఉండగా... 2020లో ఆ కేసులు మరింతగా తగ్గి కేవలం 1.1 శాతానికే పరిమితమయ్యాయి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు సగటున ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బాగా తగ్గాయి.
మార్గదర్శి అక్రమాలు వెలికి తీస్తున్నారనే సంజయ్‌పై అక్కసు
దళితులంటే తనకు ఎంతటి ద్వేషమో రామోజీరావు మరోసారి బయటపెట్టుకున్నారు. సీఐడీ అదనపు డీజీ హోదాలో ఉన్న దళిత అధికారి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ‘ఈనాడు’ కొన్ని రోజులుగా అవాకులు చెవాకులు రాస్తూనే ఉంది. కారణం... ఆయన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికి తీస్తుండటమే. దశాబ్దాలుగా తాము నిర్మించుకున్న ఆర్థిక అక్రమ సామ్రాజ్యం సీఐడీ దర్యాప్తుతో కుప్పకూలుతుండటంతో రామోజీకి దిక్కు తోచక... దళిత అధికారి సంజయ్‌ని పత్రికాముఖంగా బెదిరించడానికి దిగారు. ఆయన అధికారి హోదాలో నిర్వహించిన మీడియా సమావేశ వివరాలను కూడా యథాతథంగా కాకుండా వక్రీకరించి ప్రచురించడం ద్వారా తన దిగజారుడు పాత్రికేయాన్ని బయటపెట్టుకున్నారు.
తిరుపతి ఆటోనగర్‌లో రామోజీరావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరె అజయ్‌కుమార్, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు
మీడియా ట్రయల్స్‌పై ‘ఈనాడు’ గురివింద నీతి
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావటంతో బెంబేలెత్తుతున్న రామోజీ... గురివింద నీతిని ప్రదర్శిస్తుండటం హాస్యాస్పదమే. మార్గదర్శి అక్రమాలపై మీడియాలో కథనాలు వస్తున్నాయని... మీడియానే విచారణ చేసేస్తోందని శైలజా కిరణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరం కాక మరేమిటి? దశాబ్దాలుగా ఎన్నెన్నో వ్యవహారాల్లో ‘ఈనాడు’ దర్యాప్తు చేసి... తీర్పులిచ్చేసి... నిర్దోషుల్ని సైతం బజారుకీడ్చిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో తెలియదా? ఎందరి బతుకుల్ని బుగ్గి చేశారో మరిచిపోయారా రామోజీ? పత్రిక ద్వారా మీ ప్రత్యర్థులను వేధించిన తీరు తెలియనిదెవరికి? చంద్రబాబును అడ్డదారిలో సీఎంను చేసేందుకు అనాటి సీఎం ఎన్టీ రామారావు, ఆయన సతీమణి లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఈనాడు సాగించిన దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం గురించి ఎంత చెప్పినా తక్కువే.
వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అవహేళన, మహిళలను అవమానించేలా ఈనాడు వేసిన కార్టూన్లు, రాసిన కథనాలు పాత్రికేయ విలువలకు మాయని మచ్చ లాంటివే. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే రామోజీరావులోని వికృత పాత్రికేయం మరోసారి జడలు విప్పింది. పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం గుర్తు లేనిదెవరికి? ఇప్పుడు మార్గదర్శి చిట్స్ అక్రమాలు బట్టబయలవుతుంటే మాత్రం మీడియాలో వార్తలు రాయకూడదన్నట్టు బెదరింపులేల?
నాడు: ఫిర్యాదు చేయాలంటేనే హడల్...
‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అని సభాముఖంగా వ్యాఖ్యానించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి హయాంలో ఎస్సీ, ఎస్టీల భద్రత బాగుంటుందని అనుకోగలమా? ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దంటూ కోర్టులకెళ్లిన వ్యక్తి పాలనలో వారికి న్యాయం జరిగిందనగలమా? ‘ఎస్సీలకు పరిశుభ్రంగా ఉండడం రాదు, వారు స్నానాలు చేయరు’ అంటూ నీచంగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని నెత్తిన పెట్టుకుని పదవిలో కొనసాగించిన బాబు హయాంలో... తమపై అఘాయిత్యాలు జరిగినపుడు ఫిర్యాదు చేసే ధైర్యం ఎస్సీ, ఎస్టీలకు ఉందనుకోగలమా? పైపెచ్చు కేసుల సంఖ్య తక్కువగా చూపించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులను అసలు స్వీకరించేది కాదు. ధైర్యంచేసి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని బెదిరించి వెనక్కి పంపేసేవారు. కేసులే నమోదు చేయరు కనక దోషులకు శిక్షలు అన్న ప్రసక్తే ఉండేది కాదు.
నేడు: ఆ వర్గాల చేతిలోనే హోంమంత్రి పదవి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలోను, తరవాత మార్చిన మంత్రివర్గంలోను రెండుసార్లూ హోంమంత్రి పదవి ఎస్సీ వర్గీయులకే ఇచ్చారు సీఎం జగన్. అది కూడా.. మహిళలకు. ఆ చిత్త శుద్ధి వల్లే... ఎస్సీ, ఎస్టీలపై దాడుల నియంత్రణ సాధ్యమైంది. పైపెచ్చు బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్న నమ్మకం కలిగింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు, దిశ పోలీసింగ్ వ్యవస్థ... తదితర సంస్కరణలతో సమూల మార్పులు సంభవించాయి. దాడులు, వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పర్వా లేదు... బాధితులకు న్యాయం జరగాలి...దోషులకు శిక్షలు పడాలి అనే విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తోంది ఈ ప్రభుత్వం.
దున్నపోతుకు ఈనాడు పత్రికను తినిపిస్తున్న నేతలు
సకాలంలో ఛార్జిషీట్లు...
కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకు కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు వేయడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 2020లో 691 కేసులు, 2021లో 1,172 కేసులు, 2022లో 1,173 కేసులు మొత్తం 3,036 కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు దాఖలు చేయడం రికార్డు. 2014–19 మధ్య ఒక కేసు దర్యాప్తుకు సగటున 206 రోజులు పడితే ఈ ప్రభుత్వ హయాంలో సగటున 86 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు.
2014–19 మధ్యలో కేవలం 44 శాతం కేసుల్లోనే సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో 73 శాతం కేసుల్లో సకాలంలో ఛార్జిషీట్లు వేశారు. ఇవీ... ఈనాడు రాయని నిజాలు. ఎస్సీ, ఎస్టీల కేసుల్లో టీడీపీ హయాంలో శిక్షపడ్డ వారి శాతం 2018లో 5.7 శాతం ఉండగా... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019లో ఇది 6.8శాతానికి పెరిగింది.
పెండింగు కేసులపై ఈనాడు వక్రభాష్యం
ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి 66.25 శాతం కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉందని ‘ఈనాడు’ పేర్కొనటం పచ్చి అబద్ధం. దర్యాప్తు పూర్తయి న్యాయస్థానంలో విచారణ కోసం ఉన్న కేసుల్ని పెండింగ్ కేసులంటే ఎలా? న్యాయస్థానాల్లో వివిధ సమస్యల కారణంగా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి రామోజీరావుకు తెలియదా? వాటిని పెండింగ్ కేసులని వక్రీకరించడం దుర్బుద్ధి కాదా? జనవరి 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 3989 కేసుల్లో ఛార్జిషీట్లు వేయగా ఇప్పటికి 1384 కేసులు పరిష్కారమయ్యాయనే వాస్తవాన్ని ఎందుకు చెప్పరు రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment