
స్పీకర్ తమ్మినేని ప్రసంగిస్తున్నప్పుడు సభలో అశేష జనవాహిని
సాక్షి, అమరావతి: పెత్తందార్ల పెద్ద రామోజీరావు మరోసారి చిన్న బుద్ధిని చూపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు కలవరం కలిగిస్తోంది. అందుకే పెల్లుబుకుతున్న జనాదరణను తక్కువగా చూపించేందుకు రామోజీరావు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతున్నారు. అదీ.. బడుగు, బలహీన వర్గాలు నిర్వహించుకుంటున్న కార్యక్రమాలపైన బురద జల్లుతున్నారు. వైఎస్సార్‌సీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్న ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు వెల్లువెత్తుతున్న ప్రజాస్పందన వాస్తవ చిత్రాన్ని చూపించేందుకు జంకుతున్నారు.
బహిరంగ సభలు ప్రారంభానికి ముందు (జనం రాక ముందు), సభ ముగిసిన తర్వాత (వక్తల ప్రసంగాలు పూర్తయి జనం వెళ్లిపోయిన తరువాత) ఖాళీ అయిన కుర్చీల ఫొటోలు తీసి ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. బహిరంగ సభలకు జనం రావడం లేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభకు సంబంధించి కూడా ఇలాంటి వక్ర బుద్ధే ప్రదర్శించారు. అదీ.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎదిగిన ఓ బీసీ నేత ప్రసంగిస్తుండగా ప్రజలు లేరంటూ కొన్ని ఖాళీ కుర్చీల ఫొటో వేశారు.
ఈ సభలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగిస్తుండగానే జనం వెళ్లిపోయారని పాఠకులను నమ్మించేందుకు పాట్లు పడ్డారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఆ సభ ముగిసి, జనం వెళ్లిపోయిన తరువాత తీసిన చిత్రాన్ని ఈనాడు ప్రచురించింది. అది కూడా సభా వేదికకు దూరంగా ఉన్న ఖాళీ కుర్చీల ఫొటోలను ప్రచురించింది. వాస్తవంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. వేలాదిగా జనం తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎల్లో మీడియా తప్ప ఇతర ప్రధాన పత్రికలు ఆ ఫొటోలను ప్రముఖంగా ప్రచురించాయి. ఇతర టీవీ చానళ్లు కూడా ఆ బహిరంగ సభ విజయవంతమైన వీడియోలను ప్రసారం చేశాయి. దాంతో ఈనాడు రామోజీ పన్నాగం బెడిసికొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment