సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు విడతల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు అనంతరం ఎస్‌ఈసీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చిత్తూరు, గుంటూరు జిల్లాలను మినహాయించి మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో జిల్లాలో ఒక్కో రెవెన్యూ డివిజన్ చొప్పున 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని పంచాయతీలకు ఈ విడతలో ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 3 – 5 గంటల మధ్య సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు
పంచాయతీ ఎన్నికలపై గతేడాది అక్టోబర్ 28న రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతుండటం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆందోళన చెందుతోందంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు కమిషన్‌కు ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కమిషన్ అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతోందని తెలిపారు.
నేడు ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం
Published Sat, Jan 23 2021 3:29 AM | Last Updated on Sat, Jan 23 2021 3:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment