సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల(ఈవీ) అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2030 నాటికల్లా దేశంలోని టూ వీలర్ సెగ్మెంట్‌లో ఏకంగా 40–45 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని బైన్–కో అనే సంస్థ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తంగా 66 శాతం మంది విద్యుత్ వాహనాలనే వాడతారని ఈ అధ్యయనం తేల్చింది.
విద్యుత్ వాహనాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, రిపేర్లకు అవకాశం తక్కువ కావడం, మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండటంతో వాహనదారులు వీటిని ఎంచుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
అలాగే వాయు, శబ్ధ కాలుష్యాలు లేకపోవడం కూడా అమ్మకాల పెరుగుదలకు ఒక కారణంగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వేగంగా పెరుగుతున్న అమ్మకాలు..
మన దేశంలో మొదటి విద్యుత్ వాహనాన్ని స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1996లోనే తయారు చేసింది. ‘విక్రమ్ సఫా’ అనే పేరుతో త్రీ వీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు 400 వాహనాలను విక్రయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బీహెచ్‌ఈఎల్ 18 సీట్లున్న ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. 2001లో బెంగళూరుకు చెందిన ‘రెవా’ అనే సంస్థ కూడా ఈవీ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించింది. 2012 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల మొదలైంది.
ఆ ఏడాది 6 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్లవ్వగా.. 2015లో 9 వేలు, 2016లో 50 వేల మార్కును దాటేసింది. 2016–2019 మధ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ 51,129 నుంచి 1.61 లక్షలకు పెరిగింది. 2020లో కోవిడ్ వల్ల 1.19 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలే జరిగాయి. 2021 నుంచి మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.34 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతుండగా.. ఇతర వాహనాల సంఖ్య 27.81 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఈ సంఖ్యలో సగభాగం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment