సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 263.237 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిదేళ్లలో విద్యుత్ వాడకం ఇదే ఎక్కువ కావడం గమనార్హం. విద్యుత్ వినియోగం అధికారుల అంచనాలను మించి ఆల్‌టైమ్ రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఇంధన శాఖ శనివారం విద్యుత్ సరఫరా బులిటెన్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ గతేడాది కంటే 28.24 శాతం ఎక్కువగా ఉంది.
గతేడాది ఇదే సమయానికి 205.266 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరిగింది. రోజులో పీక్ డిమాండ్ 12,738 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 9,960 మెగావాట్లు మాత్రమే. అంటే రోజువారీ పీక్ డిమాండ్ కూడా 27.89 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,968 మెగావాట్లు కాగా.. సాయంత్రం వేళల్లో 9,786 మెగావాట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం జరుగుతున్నప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి.
రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్‌కో అత్యధికంగా థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదుకుంటోంది. దీని నుంచి 98.082 మి.యూ, ఏపీ జెన్‌కో హైడల్ నుంచి 5.470 మి.యూ, ఏపీ జెన్‌కో సోలార్ నుంచి 2.592 మి.యూ, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 38.058 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 27.531 మి.యూ, పవన విద్యుత్ ద్వారా 50.125 మి.యూ, సౌర విద్యుత్ నుంచి 22.507 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది.
బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.6.606 చొప్పున రూ.14.505 కోట్లతో 21.956 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రోజుకు కొనుగోలు చేస్తున్నారు. బిహార్‌లో 5.53 మి.యూ, మహారాష్ట్రలో 2.07 మి.యూ, జార్ఖండ్‌లో 2.22 మి.యూ, హరియాణాలో 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా, అవసరం మేరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి మరీ వినియోగదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment