థర్మల్ కేంద్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశం
వేసవిలో భారీగా పెరగనున్న విద్యుత్ వినియోగం
జూన్ వరకూ దిగుమతి చేసుకున్న బొగ్గులో స్వదేశీ బొగ్గు మిక్సింగ్
రాష్ట్రంలో ఆరు రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ భారీగా పెరగనున్నందున విదేశీ బొగ్గు దిగుమతులను ఆపొద్దని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ వరకూ విదేశీ బొగ్గు దిగుమతులను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
ఈ ఏడాది వేసవి తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే మే నెలలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 250 గిగావాట్లు ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఇంత భారీ డిమాండ్‌ను తట్టుకోవాలంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నిజానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను దశల వారీగా మూసేయాలని కేంద్రం కొంతకాలం క్రితం సూచించింది.
కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత మంచి నిర్ణయం కాదని కేంద్రం భావిస్తోంది. థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడపాలంటే బొగ్గు చాలా అవసరం. దీంతో అన్ని థర్మల్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని గతేడాది అక్టోబర్‌లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. దిగుమతి చేసుకున్న బొగ్గులో స్వదేశీ బొగ్గును కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది.
ఏపీకి ఇబ్బంది లేదు
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం, ఇంధన శాఖ ముందస్తు వ్యూహాల కారణంగా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వీటీపీఎస్‌కి రోజుకు 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,34,563 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది.
ఆర్టీపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా..90,003 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంట్‌కు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా..1,14,858 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో రోజుకు 19,200 మెట్రిక్ టన్నులు వాడుతుండగా, 1,17,375 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు రెండు రోజుల నుంచి ఆరు రోజులకు సరిపోతాయి. నిల్వలు తరిగిపోయి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది తలెత్తకుండా సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment