ఏలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ కె.నారాయణ నాయక్
ఏలూరు టౌన్: ప్రశాంతమైన కోనసీమ ప్రాంతంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు చలో అంతర్వేది, చలో అమలాపురం అంటూ పిలుపునిస్తున్నా యనీ వీటికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. ప్రజలు సంయమనంగా ఉండాలని కోరారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌తో కలిసి డీఐజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నిందితులు ఎంతటివారైనా పట్టుకుని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూ.95 లక్షలతో నూతనంగా రథాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కోవిడ్–19 నిబంధనలు అమల్లో ఉండగా, కోనసీమలో 34, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతులు లేవన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అంతర్వేది ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సీబీఐ దర్యాప్తులో ఉన్నందున ఈ కేసుకు సంబంధించి ఇతర విషయాలపై మాట్లాడకూడదన్నారు. అంతర్వేది ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలెవరూ ఆందోళనలు చేసేందుకు రావటానికి అనుమతులు లేవని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment