eluru range DIG
-
‘ఆ ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : మండపేట టౌన్లో రాత్రిపూట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. బుధవారం డీఐజీ మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో 20 మంది వరకు అనుమాతులు ఉన్నారని, సీసీ టీవీ ఫుటేజ్‌లో కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. మండపేట ప్రజలు సమన్వయంతో ఉండాలని సూచించారు. (‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్) ‘అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి దేవాలయాల దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ ఏర్పరుచుకోవాలి. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పరుచుకుని గుడి బాధ్యతలు కమిటీ తీసుకోవాలి. చిన్న టెంపుల్స్‌లో సైతం కమిటీలు బాధ్యత తీసుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేయని ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలి’. అని ఏలూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. (అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత') -
‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్
ఏలూరు టౌన్: ప్రశాంతమైన కోనసీమ ప్రాంతంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు చలో అంతర్వేది, చలో అమలాపురం అంటూ పిలుపునిస్తున్నా యనీ వీటికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. ప్రజలు సంయమనంగా ఉండాలని కోరారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌తో కలిసి డీఐజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నిందితులు ఎంతటివారైనా పట్టుకుని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూ.95 లక్షలతో నూతనంగా రథాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్–19 నిబంధనలు అమల్లో ఉండగా, కోనసీమలో 34, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతులు లేవన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అంతర్వేది ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సీబీఐ దర్యాప్తులో ఉన్నందున ఈ కేసుకు సంబంధించి ఇతర విషయాలపై మాట్లాడకూడదన్నారు. అంతర్వేది ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలెవరూ ఆందోళనలు చేసేందుకు రావటానికి అనుమతులు లేవని చెప్పారు. -
‘ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదు’
సాక్షి, పశ్చిమగోదావరి : సెప్టెంబరు అయిదో తేదిన అంతర్వేది రథం కేసును సీబీఐకు అప్పగించడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ మోహానరావు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పరంగ కొత్త రథం తయారు అవుతుందని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని, ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కోనసీమ ప్రశాంతమైన జిల్లా అని, కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీఐజీ ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామన్నారు. (‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’) -
ఏలూరు రేంజి డీఐజీపైనా వేటు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాజమండ్రిలో పుష్కరాల తొలి రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు మృత్యువాత పడిన నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌ను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. హరికుమార్ స్థానంలో మైనార్టీల సంక్షేమ విభాగం ప్రత్యేక అధికారి మహమ్మద్ ఇక్బాల్‌ను నియమించనున్నట్లు సమాచారం. పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. డీఐజీ హరికుమార్ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల ప్రారంభానికి రెండు వారాల ముందునుంచే రాజమండ్రిలో మకాం వేశారు. అయితే, పుష్కరాల తొలిరోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనకు పోలీసుల తీరే కారణమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, మైనారిటీ సంక్షేమ విభాగం ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఇక్బాల్‌కు ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే.