సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాజమండ్రిలో పుష్కరాల తొలి రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు మృత్యువాత పడిన నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్‌లైన్‌లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌ను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
హరికుమార్ స్థానంలో మైనార్టీల సంక్షేమ విభాగం ప్రత్యేక అధికారి మహమ్మద్ ఇక్బాల్‌ను నియమించనున్నట్లు సమాచారం. పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. డీఐజీ హరికుమార్ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల ప్రారంభానికి రెండు వారాల ముందునుంచే రాజమండ్రిలో మకాం వేశారు.
అయితే, పుష్కరాల తొలిరోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనకు పోలీసుల తీరే కారణమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, మైనారిటీ సంక్షేమ విభాగం ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఇక్బాల్‌కు ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే.
ఏలూరు రేంజి డీఐజీపైనా వేటు?
Published Fri, Jul 24 2015 9:24 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement