ఆధారాలు పదిలమేనా!
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనకు సంబంధించిన ‘ఆధారాలు’ పదిలంగానే ఉంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 29 మందిని పొట్టన పెట్టుకుని, మరెందరినో క్షతగాత్రులుగా మిగిల్చిన ఈ ఘోర నిర్లక్ష్యంపై పోలీసు దర్యాప్తు మినహా విచారణ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అధికార యంత్రాంగాలు పుష్కర విధుల్లో ఉన్నాయని, అవి ముగిసిన తరువాత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటివరకు ఈ ఘోరానికి కీలక ఆధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లు భద్రంగా ఉంటాయా? అన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది.
వీడియో ఫుటేజ్‌లే కీలకం..
రాజమండ్రి నగరంలో పుష్కర బందోబస్తు, భద్రతా చర్యల్లో భాగంగా అనేకచోట్ల తాత్కాలిక ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. నగరవ్యాప్తంగా తొలుత భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. స్థానిక నేతల ఒత్తిడి మేరకు వీటిని తొలగించినట్లు ఆరోపణలొచ్చాయి. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదై ఉంటాయి. మరోవైపు తొక్కిసలాట చోటు చేసుకున్న పుష్కర ఘాట్ వద్దా ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి.
ఉదంతం జరిగిన రోజు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలతోపాటు ఇతర అంశాలను ఇవి రికార్డు చేస్తాయి. పుష్కర ఘాట్‌లోకి వీవీఐపీల ప్రవేశం, ఆ సమయంలో పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలు, వారి కదలికలు క్యాప్చర్ అవుతాయి. పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం భక్తులను ఎంతసేపు ఆపారు? ఆయన ఏ సమయంలో ఘాట్ నుంచి వెళ్లారు? తదితర అంశాలకూ ఈ వీడియో ఫుటేజే ప్రధాన ఆధారం.
తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు పక్కాగా తెలియాలన్నా సీసీ కెమెరా ఫీడ్‌ను అధ్యయనం చేయాల్సిందే. పుష్కరాల అనంతరం ఏర్పాటయ్యే విచారణ కమిటీ/కమిషన్‌లకు సీసీ కెమెరాా ఫుటేజ్‌లే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ఈ ఉదంతంలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుపైనే ఆరోపణలు రావడం, జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సీసీ కెమెరా ఫీడ్‌లో ‘మార్పుచేర్పులు’ జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అదే జరిగితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదముందని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫీడ్‌ను భద్రపరచడంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోందని వాపోతున్నాయి.