rajahmundry stampede
-
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
ఔను... తొక్కేశారు!
జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు ఆధారాలు ఇవ్వని అధికారులు మరో రెండు వారాల గడువు కావాలని విన్నపం నేటితో పూర్తి కానున్న కమిషన్ కాల పరిమితి రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు సమర్పించకుండా ప్రభుత్వ శాఖలు ఆధారాల ను తొక్కిపెట్టాయి. కమిషన్ గడువు బుధవారంతో ముగియనున్నప్పటికీ మంగళవారం జరిగిన విచారణలో ఊహించినట్టుగానే ఆధారా ల సమర్పణకు ప్రభుత్వ శాఖలు మరో రెండు వారాల గడువు కోరడం గమనార్హం. దీనిపై ‘సాక్షి’లో కథనం వచ్చిన విషయం విదితమే. గడువు విషయం ఎలా ఉన్నప్పటికీ కనీసం ఆధారాలిచ్చే ప్రభుత్వ శాఖల వివరాలు ఇవ్వా లని కమిషన్ కోరగా, ఆ మేరకు శాఖల జాబితా ను జస్టిస్ సోమయాజులుకు సమర్పించాయి. కాగా బుధవారంతో గడువు ముగుస్తున్నందున కమిషన్ కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు జస్టిస్ సోమయాజులు తెలిపారు. ప్రభుత్వం గడుపు పొడిగిస్తే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం కమిషన్ మరోసారి బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వ శాఖ లు ఎప్పుడు ఆధారాలు సమర్పిస్తాయని ప్రభు త్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావును జస్టిస్ సోమయాజులు ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో వివిధశాఖలు నిమగ్నమయ్యాయని, అవి ఒకచోట లేనందున ఆధారాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆ వీడియోలు తీసుకోవాలి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ చానల్ (ఎన్జీసీ) చిత్రీకరించిన వీడియోలను ప్రభుత్వ శాఖలు తీసుకోవచ్చని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిషన్‌కు సూచించారు. ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో రికార్డింగ్ లేదని చెబుతున్న దృష్ట్యా, కనీసం ఎన్జీసీ వీడియో క్లిపింగులైనా కమిషన్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సెక్షన్-14 ప్రకారం ఏ శాఖ నుంచైనా ఆధారాలు రప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. ఘటనపై సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని కోరారు. కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణలో కాంగ్రెస్ లీగల్‌సెల్ నాయకుడు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డీఎస్పీలు రామకృష్ణ, కులశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాచార శాఖ వద్ద ఆధారాలు ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సమాచార శాఖ వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుందని, పుష్కర తొక్కిసలాటపై సమాచార శాఖ తీసిన వీడియోలు, ఫొటోలను కమిషన్ పరిశీలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌ను కోరారు. ప్రచార ఆర్భా టం కోసం పుష్కర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. గోదావరిపుష్కర ఫొటోఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. లక్ష్యం నెరవేరదు పుష్కర తొక్కిసలాట ఎలా జరిగింది, దీనికెవరు బాధ్యులనేది తేల్చకపోతే కమిషన్ లక్ష్యం నెరవేరదని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పేర్కొన్నారు. దుర్ఘటన ఎలా జరిగింది, కారణాలేమిటి, కారకులు ఎవరనేది తేల్చాలని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చాక పుష్కర ఘాట్ గేటు ఎవరు మూసేశారు, రెండున్నర గంటల తర్వాత ఎవరు తీశారనేది తేలాలని తెలిపారు. అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఉన్నందున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ ఇచ్చే సూచనలు మార్గదర్శకంగా ఉండాలని చెప్పారు. సీఎం అక్కడెందుకు వచ్చారు? దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన కోటిలింగాల ఘాట్‌తో పాటు వీఐపీ తదితర ఘాట్లుం డగా.. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లోకి ఎందుకొచ్చారని న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నగర కన్వీనర్ వెండ్రపగడ ఉమామహేశ్వరి ప్రశ్నించా రు. సీఎంను ఎవరు తప్పుదారి పట్టించారని, ఆయన పర్యటనను ఎవరు ఖరారు చేశారనేది నిగ్గు తేల్చాలని కోరారు. -
పుష్కరాల్లో తొక్కిసలాట బాధాకరం: చంద్రబాబు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ఏర్పాట్లు చేసినా తొక్కిసలాట జరిగిందని వాపోయారు. సోమవారం శాసనసభలో తొక్కిసలాట మృతులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసినా తొలి రోజునే ఘటన జరగడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో 28 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. ఘటన జరిగిన తర్వాత తాను రాజమండ్రిలోనే ఉండి పరిస్థితులు చక్కదిద్దానని చెప్పుకొచ్చారు. చనిపోయినా వారికి తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చామని తెలిపారు. -
ఏలూరు రేంజి డీఐజీపైనా వేటు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాజమండ్రిలో పుష్కరాల తొలి రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు మృత్యువాత పడిన నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌ను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. హరికుమార్ స్థానంలో మైనార్టీల సంక్షేమ విభాగం ప్రత్యేక అధికారి మహమ్మద్ ఇక్బాల్‌ను నియమించనున్నట్లు సమాచారం. పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. డీఐజీ హరికుమార్ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల ప్రారంభానికి రెండు వారాల ముందునుంచే రాజమండ్రిలో మకాం వేశారు. అయితే, పుష్కరాల తొలిరోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనకు పోలీసుల తీరే కారణమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, మైనారిటీ సంక్షేమ విభాగం ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఇక్బాల్‌కు ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. -
ఆధారాలు పదిలమేనా!
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనకు సంబంధించిన ‘ఆధారాలు’ పదిలంగానే ఉంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 29 మందిని పొట్టన పెట్టుకుని, మరెందరినో క్షతగాత్రులుగా మిగిల్చిన ఈ ఘోర నిర్లక్ష్యంపై పోలీసు దర్యాప్తు మినహా విచారణ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అధికార యంత్రాంగాలు పుష్కర విధుల్లో ఉన్నాయని, అవి ముగిసిన తరువాత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటివరకు ఈ ఘోరానికి కీలక ఆధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లు భద్రంగా ఉంటాయా? అన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది. వీడియో ఫుటేజ్లే కీలకం.. రాజమండ్రి నగరంలో పుష్కర బందోబస్తు, భద్రతా చర్యల్లో భాగంగా అనేకచోట్ల తాత్కాలిక ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. నగరవ్యాప్తంగా తొలుత భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. స్థానిక నేతల ఒత్తిడి మేరకు వీటిని తొలగించినట్లు ఆరోపణలొచ్చాయి. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదై ఉంటాయి. మరోవైపు తొక్కిసలాట చోటు చేసుకున్న పుష్కర ఘాట్ వద్దా ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉదంతం జరిగిన రోజు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలతోపాటు ఇతర అంశాలను ఇవి రికార్డు చేస్తాయి. పుష్కర ఘాట్‌లోకి వీవీఐపీల ప్రవేశం, ఆ సమయంలో పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలు, వారి కదలికలు క్యాప్చర్ అవుతాయి. పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం భక్తులను ఎంతసేపు ఆపారు? ఆయన ఏ సమయంలో ఘాట్ నుంచి వెళ్లారు? తదితర అంశాలకూ ఈ వీడియో ఫుటేజే ప్రధాన ఆధారం. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు పక్కాగా తెలియాలన్నా సీసీ కెమెరా ఫీడ్‌ను అధ్యయనం చేయాల్సిందే. పుష్కరాల అనంతరం ఏర్పాటయ్యే విచారణ కమిటీ/కమిషన్లకు సీసీ కెమెరాా ఫుటేజ్లే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ఈ ఉదంతంలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుపైనే ఆరోపణలు రావడం, జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సీసీ కెమెరా ఫీడ్‌లో ‘మార్పుచేర్పులు’ జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదముందని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫీడ్‌ను భద్రపరచడంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోందని వాపోతున్నాయి. -
'తొక్కిసలాట'పై సుమోటోగా స్పందించిన హైకోర్టు
హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై హైకోర్టు తనకు తానుగా స్పందించింది. దీనిపై విచారణను సుమోటోగా స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులెవరు, సహాయచర్యలు ఏం తీసుకున్నారని నోటీసుల్లో ప్రశ్నించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి గడువు విధించింది. గోదావరి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా జూలై 14న రాజమండ్రి పుష్కర ఘాటులో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.