ఔను... తొక్కేశారు! | Justice C Y Somayajulu commission duration ends today | Sakshi
Sakshi News home page

ఔను... తొక్కేశారు!

Published Wed, Jun 29 2016 9:04 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

Justice C Y Somayajulu commission duration ends today

జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు ఆధారాలు
ఇవ్వని అధికారులు
మరో రెండు వారాల గడువు కావాలని విన్నపం
నేటితో పూర్తి కానున్న కమిషన్ కాల పరిమితి

 
రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు  సమర్పించకుండా ప్రభుత్వ శాఖలు ఆధారాల ను తొక్కిపెట్టాయి. కమిషన్ గడువు బుధవారంతో ముగియనున్నప్పటికీ  మంగళవారం జరిగిన విచారణలో ఊహించినట్టుగానే ఆధారా ల సమర్పణకు ప్రభుత్వ శాఖలు మరో రెండు వారాల గడువు కోరడం గమనార్హం. దీనిపై ‘సాక్షి’లో కథనం వచ్చిన విషయం విదితమే. గడువు విషయం ఎలా ఉన్నప్పటికీ కనీసం ఆధారాలిచ్చే ప్రభుత్వ శాఖల వివరాలు ఇవ్వా లని కమిషన్ కోరగా, ఆ మేరకు శాఖల జాబితా ను జస్టిస్ సోమయాజులుకు సమర్పించాయి.
 
 కాగా బుధవారంతో గడువు ముగుస్తున్నందున కమిషన్ కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు జస్టిస్ సోమయాజులు తెలిపారు. ప్రభుత్వం గడుపు పొడిగిస్తే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం కమిషన్ మరోసారి బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వ శాఖ లు ఎప్పుడు ఆధారాలు సమర్పిస్తాయని ప్రభు త్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావును జస్టిస్ సోమయాజులు ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో వివిధశాఖలు నిమగ్నమయ్యాయని, అవి ఒకచోట లేనందున ఆధారాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
 
ఆ వీడియోలు తీసుకోవాలి
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ చానల్ (ఎన్‌జీసీ) చిత్రీకరించిన వీడియోలను ప్రభుత్వ శాఖలు తీసుకోవచ్చని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిషన్‌కు సూచించారు. ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో రికార్డింగ్ లేదని చెబుతున్న దృష్ట్యా, కనీసం ఎన్‌జీసీ వీడియో క్లిపింగులైనా కమిషన్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సెక్షన్-14 ప్రకారం ఏ శాఖ నుంచైనా ఆధారాలు రప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. ఘటనపై సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని కోరారు.
 
కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణలో కాంగ్రెస్ లీగల్‌సెల్ నాయకుడు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డీఎస్పీలు రామకృష్ణ, కులశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 
సమాచార శాఖ వద్ద ఆధారాలు
ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సమాచార శాఖ వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుందని, పుష్కర తొక్కిసలాటపై సమాచార శాఖ తీసిన వీడియోలు, ఫొటోలను కమిషన్ పరిశీలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌ను కోరారు. ప్రచార ఆర్భా టం కోసం పుష్కర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. గోదావరిపుష్కర ఫొటోఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు.
 
లక్ష్యం నెరవేరదు
పుష్కర తొక్కిసలాట ఎలా జరిగింది, దీనికెవరు బాధ్యులనేది తేల్చకపోతే కమిషన్ లక్ష్యం నెరవేరదని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పేర్కొన్నారు. దుర్ఘటన ఎలా జరిగింది, కారణాలేమిటి, కారకులు ఎవరనేది తేల్చాలని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చాక పుష్కర ఘాట్ గేటు ఎవరు మూసేశారు, రెండున్నర గంటల తర్వాత ఎవరు తీశారనేది తేలాలని తెలిపారు. అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఉన్నందున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ ఇచ్చే సూచనలు మార్గదర్శకంగా ఉండాలని చెప్పారు.
 
సీఎం అక్కడెందుకు వచ్చారు?
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన కోటిలింగాల ఘాట్‌తో పాటు వీఐపీ తదితర ఘాట్లుం డగా.. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లోకి ఎందుకొచ్చారని న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నగర కన్వీనర్ వెండ్రపగడ ఉమామహేశ్వరి ప్రశ్నించా రు. సీఎంను ఎవరు తప్పుదారి పట్టించారని, ఆయన పర్యటనను ఎవరు ఖరారు చేశారనేది నిగ్గు తేల్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement