justice c y somayajulu commission
-
ఔను... తొక్కేశారు!
జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు ఆధారాలు ఇవ్వని అధికారులు మరో రెండు వారాల గడువు కావాలని విన్నపం నేటితో పూర్తి కానున్న కమిషన్ కాల పరిమితి రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు సమర్పించకుండా ప్రభుత్వ శాఖలు ఆధారాల ను తొక్కిపెట్టాయి. కమిషన్ గడువు బుధవారంతో ముగియనున్నప్పటికీ మంగళవారం జరిగిన విచారణలో ఊహించినట్టుగానే ఆధారా ల సమర్పణకు ప్రభుత్వ శాఖలు మరో రెండు వారాల గడువు కోరడం గమనార్హం. దీనిపై ‘సాక్షి’లో కథనం వచ్చిన విషయం విదితమే. గడువు విషయం ఎలా ఉన్నప్పటికీ కనీసం ఆధారాలిచ్చే ప్రభుత్వ శాఖల వివరాలు ఇవ్వా లని కమిషన్ కోరగా, ఆ మేరకు శాఖల జాబితా ను జస్టిస్ సోమయాజులుకు సమర్పించాయి. కాగా బుధవారంతో గడువు ముగుస్తున్నందున కమిషన్ కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు జస్టిస్ సోమయాజులు తెలిపారు. ప్రభుత్వం గడుపు పొడిగిస్తే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం కమిషన్ మరోసారి బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వ శాఖ లు ఎప్పుడు ఆధారాలు సమర్పిస్తాయని ప్రభు త్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావును జస్టిస్ సోమయాజులు ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో వివిధశాఖలు నిమగ్నమయ్యాయని, అవి ఒకచోట లేనందున ఆధారాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆ వీడియోలు తీసుకోవాలి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ చానల్ (ఎన్జీసీ) చిత్రీకరించిన వీడియోలను ప్రభుత్వ శాఖలు తీసుకోవచ్చని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిషన్‌కు సూచించారు. ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో రికార్డింగ్ లేదని చెబుతున్న దృష్ట్యా, కనీసం ఎన్జీసీ వీడియో క్లిపింగులైనా కమిషన్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సెక్షన్-14 ప్రకారం ఏ శాఖ నుంచైనా ఆధారాలు రప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. ఘటనపై సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని కోరారు. కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణలో కాంగ్రెస్ లీగల్‌సెల్ నాయకుడు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డీఎస్పీలు రామకృష్ణ, కులశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాచార శాఖ వద్ద ఆధారాలు ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సమాచార శాఖ వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుందని, పుష్కర తొక్కిసలాటపై సమాచార శాఖ తీసిన వీడియోలు, ఫొటోలను కమిషన్ పరిశీలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌ను కోరారు. ప్రచార ఆర్భా టం కోసం పుష్కర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. గోదావరిపుష్కర ఫొటోఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. లక్ష్యం నెరవేరదు పుష్కర తొక్కిసలాట ఎలా జరిగింది, దీనికెవరు బాధ్యులనేది తేల్చకపోతే కమిషన్ లక్ష్యం నెరవేరదని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పేర్కొన్నారు. దుర్ఘటన ఎలా జరిగింది, కారణాలేమిటి, కారకులు ఎవరనేది తేల్చాలని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చాక పుష్కర ఘాట్ గేటు ఎవరు మూసేశారు, రెండున్నర గంటల తర్వాత ఎవరు తీశారనేది తేలాలని తెలిపారు. అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఉన్నందున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ ఇచ్చే సూచనలు మార్గదర్శకంగా ఉండాలని చెప్పారు. సీఎం అక్కడెందుకు వచ్చారు? దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన కోటిలింగాల ఘాట్‌తో పాటు వీఐపీ తదితర ఘాట్లుం డగా.. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లోకి ఎందుకొచ్చారని న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నగర కన్వీనర్ వెండ్రపగడ ఉమామహేశ్వరి ప్రశ్నించా రు. సీఎంను ఎవరు తప్పుదారి పట్టించారని, ఆయన పర్యటనను ఎవరు ఖరారు చేశారనేది నిగ్గు తేల్చాలని కోరారు. -
పుష్కర తొక్కిసలాటపై ఇప్పటికీ ఆధారాలివ్వని యంత్రాంగం
29 మంది బలైన ఘోరంపై క్షమార్హం కాని అలసత్వం ఏకసభ్య కమిషన్ ముందు వాయిదా మంత్రజపం రేపటితో ముగియనున్న కమిషన్ గడువు నేడు రాజమహేంద్రవరంలో మరోసారి విచారణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని ప్రగల్భాలు పలుకుతూ, ‘గాలిలో బొమ్మలు గీసి’ ఊరిస్తున్న ప్రభుత్వం.. 29 నిండు ప్రాణాలు గాలిలో కలిసిన దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. కారణమేంటో, కారకులెవరో తేల్చలేదు. పుష్కరుడు గోదావరి జలాల్లో ప్రవేశించే పుణ్యఘడియల్లో స్నానమాచరించాలని గంటల తరబడి నిరీక్షించిన వారిపై మృత్యువే తొక్కిసలాట రూపంలో పాశం విసిరింది. అంత ఘోరం జరిగితే దానికి గల అసలు కారణాలను తొక్కేసేందుకు యత్నిస్తున్నట్టుంది అధికార యంత్రాంగం తీరు. కాకినాడ : గత జూలై 14న గోదావరి పుష్కరాల ప్రారంభం నాడు రాజమహేంద్రవరం పుష్కరఘాట్వద్ద జరిగిన తొక్కిసలాట, అనంతర పరిణామాలకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన దుర్ఘటనపై విచారణకు నియమించిన జస్టిస్ సోమయూజులు ఏకసభ్య కమిషన్‌కు కూడా నివేదించారు. సీఎం వీఐపీలకు కేటాయించిన ఘాట్‌లో కాక సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో సుమారు గంటపాటు పిండప్రదానాలు చేయడం, ఆయన వెళ్లిపోయే వరకూ లక్షలాది మంది భక్తులను గేటు బయటే నిలిపి ఒకేసారి అనుమతించడం, టెలీఫిల్మ్ నిర్మాణం కోసం కూడా భక్తులు వెల్లువలా ఒకేసారి ఘాట్‌కు వచ్చేలా నిలిపివేయడం ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగమవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీఎం సమక్షంలో జరిగినందునే.. దుర్ఘటన జరిగిన కొన్నినెలల తరువాతే ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15న జస్టిస్ సోమయాజులు కమిషన్ నియమించింది. కమిషన్ మొదటిసారి ఈ ఏడాది జనవరి 18న బహిరంగ విచారణ జరపగా మొదటి అఫిడవిట్‌ను ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు వేశారు. తరువాత 18 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. రెండోసారి ఫిబ్రవరి 23న, మూడోసారి మార్చి 21న బహిరంగ విచారణ నిర్వహించాక కమిషన్ కాలపరిమితి ముగియడంతో సర్కారు మరో మూడు నెలలు కమిషన్ గడువు పెంచింది. అనంతరం జూన్ 18, 21న రెండు పర్యాయాలు విచారణ నిర్వహించగా అఫిడవిట్లు దాఖలు చేసినవారు సమర్పించిన ఆధారాలు, సీడీలను కమిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పరిశీలించింది. తిరిగి 23న బహిరంగ విచారణ చేపట్టారు. కమిషన్‌కు ఆధారాలు సమర్పించేందుకు ప్రభుత్వం మరో రెండు వారాలు గడువు కోరడంతో తిరిగి జూన్ 28కి విచారణ వాయిదా వేసింది. కాగా కమిషన్ గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇన్నిసార్లు విచారణ నిర్వహించినా అధికారులు దుర్ఘటనకు సంబంధించి ఒక్క ఆధారం కూడా అందజేయకపోవడం గమనార్హం. పుష్కర దుర్ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనమైనా, చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరగడంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్నే జపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే విచారణలో అధికారులు ఏం చేస్తారో చూడాలి. సీఎంను విచారణకు పిలవాలి.. తొక్కిసలాటప్పుడుఘాట్లో ఉన్న ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి అని, పుష్కరాలను రాజమహేంద్రవరం నుంచి పర్యవేక్షించిన సీఎం తానే ఐ విట్నెస్ అని విలేకరుల సమావేశంలో తెలిపారని, అలాంటి సీఎంను బహిరంగ విచారణకు పిలవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీబార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు విచారణ జరిపినా జిల్లా యంత్రాంగం నుంచి కనీస సమాచారం, ఆధారాలు అందజేయకపోగా, ఇప్పుడు మరోసారి మూడు నెలల గడువు కోరడాన్ని అఫిడవిట్ దాఖలు చేసిన ముప్పాళ్ల తదితరులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29న కమిషన్ గడువు ముగిసిపోనున్న తరుణంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కమిషన్ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కమిషన్ అనేక పర్యాయాలు విచారణ జరిపినా ఆధారాలు ఇవ్వలేని యంత్రాంగం మరో మూడు నెలలు పొడిగిస్తే మాత్రం ఇస్తుందనే గ్యారంటీ ఏమిటని అఫిడవిట్లు దాఖలు చేసిన వారు ప్రశ్నిస్తున్నారు. తప్పిదాలు బయట పడతాయనే జాప్యం పుష్కరాల సందర్భంగా అధికారుల తప్పిదాలు బయట పడతాయనే కమిషన్‌కు ఆధారాలు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు. కలెక్టర్ తాను ఇచ్చిన తొలి నివేదికలో ఆధారాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే కలెక్టర్ మరో మూడు నెలలు గడువు కోరడం గమనార్హం. అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారు. పుష్కరాలకు లక్షలాది రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తీరా ఇప్పుడు దానిలో రికార్డింగ్ చేయలేదని బుకాయిస్తున్నారు. దుర్ఘటన నాడు నేషనల్ జియోగ్రఫిక్ చానల్ చిత్రీకరించిన చిత్రాలను బయటపెట్టాలి. వాస్తవాలు బయట పెట్టకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అర్థమవుతుంది. కమిషన్ గడువు ముగుస్తున్నందున అధికారులు ఆధారాలు సమర్పించి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు