మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం | Employment opportunities are plentiful in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం

Published Thu, May 11 2023 3:27 AM | Last Updated on Thu, May 11 2023 7:38 AM

Employment opportunities are plentiful in Andhra Pradesh - Sakshi

(సాక్షి, అమరావతి): ఉద్యోగాల్లేవని ఒకరోజు... అప్పులు తెచ్చేస్తున్నారంటూ మరో రోజు... ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఇంకోరోజు!!. వార్త ఏదైనా అబద్ధమే అజెండా. రామోజీరావుకు నిజాలతో పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనను ఎవరు తప్పుబట్టినా... ‘ఈనాడు’ దృష్టిలో వాళ్లు ప్ర­ము­­ఖులు.. నిపుణులు.. సామాజికవేత్తలు!. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవంటూ సోమవారం పతాక శీర్షికలో వండిన కథనం ఈ కోవలోనిదే. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో భాగమే. ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ తాలూకు వాస్తవాలివిగో... 

ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోని టాప్‌–5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. రెండు నెలల కిందట మార్చిలో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఇండియా–2023 స్కిల్‌ నివేదిక’. ఇది... వాస్తవం. కానీ ‘ఈనాడు’ ఏం చెబుతోందంటే... రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు యువత వెళ్లిపోతున్నారని, దీంతో ఊళ్లలో వృద్దులే మిగులుతారని. అది కూడా సామాజిక వేత్తలు అంటున్నారని!!. 

అసలేంటి చెరుకూరి రామోజీరావు కడుపుమంట? ఇక్కడి పిల్లలు విదేశాలకు వెళ్లకూడదా? అక్కడ చదవకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఏం! గతంలో ఆంధ్రప్రదేశ్‌ యువత విదేశాలకు వెళ్లలేదా? పై చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లటమనేది ఇప్పుడు మొదలైందేమీ కాదుకదా? అలాగే ఇతర రాష్ట్రాల నుంచీ అవసరాన్ని బట్టి మెరుగైన వేతనాల కోసం ఇక్కడకు తగిన నైపుణ్యాలున్న వారు వస్తున్నారు కదా!!. ఇంతటి సహజమైన ప్రక్రియకు రాజకీయాలు అంటగట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న ‘ఈనాడు’కు ఇంకా దిగజారడానికి ఏమైనా ఉందా? 

కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ఇండియా– 2023 స్కిల్‌ రిపోర్ట్‌లో దేశంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాల్గో స్థానంలో ఉందంటేనే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు ఇదే నివేదికలో... రాష్ట్రంలో సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు అద్భుతంగా మెరుగయ్యాయని కేంద్రం ప్రశంసించింది. వీటివల్ల 2022 సంవత్సరంలో అత్యధిక వృద్ధి సాధించినట్లు స్పష్టం చేసింది.

ఈ వాస్తవాలను వదిలేసి బురద జల్లుతున్న ‘ఈనాడు’కు చంద్రబాబు సిండ్రోమ్‌ ముదిరిపోయిందన్నది పచ్చి నిజం. ఏపీలో 22 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం... 18 నుంచి 21 సంవత్సరాలు, 26 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉపాధి వనరులు కలిగిన రాష్ట్రాల్లో టాప్‌ ఐదు రాష్ట్రాల్లో  ఏపీ ఒకటి. ఇక్కడ అత్యధికంగా 93.50 మంది అభ్యర్ధులు ఇంటర్న్‌షిప్‌లు పొందుతుండగా... ఇంటర్న్‌షిప్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది నెంబర్‌–1 స్థానం. 

‘‘నైపుణ్యం లేని ఉద్యోగాలకన్నా ఏదైనా టాలెంట్‌ పూల్‌ ద్వారా ఉద్యోగాలను పొందాలని యువత కోరుకుంటోంది. రాబోయే సంవత్సరాల్లో టాలెంట్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ల విషయంలో ఏపీ ముందుంటుంది. బీఈ, బీటెక్, ఐటీఐ, ఎంఎస్‌సీ, బీసీఏ రంగాల్లో అత్యధిక అర్హత కలిగిన టాలెంట్‌ యువత స్కోరు 60 శాతం పైనే ఉంది.’’ అని నివేదిక తెలిపింది. ఇంకా ప్లేస్‌మెంట్లలో 2.6 లక్షలు, అంతకన్నా ఎక్కువగా వేతనాలు అందే రాష్ట్రాలోఏపీ మొదటి స్థానంలో ఉంది.

చంద్రబాబు నాయుడి హయాంలో ప్లేస్‌మెంట్‌లు 37 వేలు మాత్రమే ఉంటే అదే ఇప్పుడు ఈ ప్రభుత్వ హ­యాంలో 2021–22లో ప్లేస్‌మెంట్లు 85 వేలకు చే­రాయి. పైపెచ్చు రాష్రంలో చంద్రబాబు హ­యాం­లో 2018–19లో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉం­­డగా... ఇపుడది 4.2 శాతానికి తగ్గినట్లు స్వ­యం­గా కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

బీఈఎల్‌ నూతన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ప్రారంభించిన దృశ్యం (ఫైల్‌) 

హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోయిందెప్పుడు రామోజీ? 
ఈ వాస్తవాలను విస్మరించిన ‘ఈనాడు’... ఎప్పుడో 2015లోనే దేశం వీడి వెళ్లిపోయిన హెచ్‌ఎస్‌బీసీని పట్టుకుని ఇప్పుడే వెళ్లిపోయిందంటూ అబద్దాలను వండేసింది. ఇక ఇన్ఫోసిస్, బీఈఎల్, అమెజాన్‌ డీసీ, డిక్సన్, డబ్లు్యఎన్‌ఎస్, ర్యాండ్‌స్టాడ్‌ వంటి దిగ్గజ సంస్థలు వచ్చి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నా... వాటికి ప్రస్తావిస్తే ఒట్టు. పైపెచ్చు కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు!!. 2015లోనే హెచ్‌ఎస్‌బీసీ తన వ్యాపార వ్యూహంలో భాగంగా దేశంలో కార్యకలాపాలను మూసేసుకుని వెళ్లిపోతే ఇప్పుడే కొత్తగా విశాఖ నుంచి హెచ్‌ఎస్‌బీసి వెళ్లిపోయిందని... అది కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వల్లేనని ‘ఈనాడు’ రాసిందంటే జగన్‌ సర్కారుపై ఎంత కక్షతో వ్యవహరిస్తున్నదో అర్థంకాక మానదు. 

పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఏపీ
ప్రైవేటు రంగంలో అత్యధిక ఉద్యోగాలిచ్చే సామర్థ్యం ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగంలోనే... గడిచిన నాలుగేళ్ల రూ.24 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 12.60 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిజానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) సమయానికిస్తేనే ఇవి బతికి బట్టకడతాయని బాబుకు తెలిసినా వీటిని పట్టించుకోలేదు. ఇన్సెంటివ్‌లను గాలికొదిలేశారు. బాబు  నిర్లక్ష్యంతో దారుణంగా చితికిపోయిన ఈ రంగానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి... ప్రోత్సాహకాలను సమయానికి ఇవ్వడమే కాకుండా... అలా ఇచ్చేందుకు పటిష్ఠమైన వ్యవస్థను తీసుకొచ్చింది.

అందుకే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. ఇక భారీ పరిశ్రమల్లోనైతే 85 వేల మందికి ఉపాధి లభించింది. ఐటీ రంగంలో చంద్రబాబు హయాంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు, 14వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ ఈ నాలుగేళ్లలో జగన్‌ సార«థ్యంలో ఈ రంగంలో రూ.5,700 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ గణాంకాలన్నీ ఏ సామాజిక వేత్తలో, వైఎస్సార్‌సీపీ అభిమానులో చెబుతున్నవి కాదు. గణాంకాలన్నీ మదించి... కేంద్ర ప్రభుత్వం నివేదించినవి.  

ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ... విప్లవం 
ప్రైవేట్‌ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో సైతం గతంలో ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలను ఈ ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు. కానీ వైఎస్‌ జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టాక ఈ సంఖ్య 6 లక్షలు దాటింది. అంటే... ఉన్న ఉద్యోగాల్లో 50 శాతాన్ని అదనంగా... అది కూడా ప్రభుత్వ రంగంలో ఈ నాలుగేళ్లలోనే సాధ్యం చేసి చూపించారు. వీరికి తోడు మూడు లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అవకాశాలొచ్చాయి.

మరి ఇవన్నీ ఎవరికిచ్చారు రామోజీ? ఈ రాష్ట్ర యువతకే కదా? వేరే దేశంలోని యువతకు కాదు కదా? ఎందుకీ దిగజారుడు రాతలు!!. నిత్యం ఏదో ఒకరకంగా బురద జల్లేటపుడు... కనీసం ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలి కదా? చంద్రబాబుపై ఉన్న ప్రేమతో ఈ రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నామనే స్పృహ లేదెందుకు? ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే సుమారు 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలివ్వటం... వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 49 వేల మందికి ఉద్యోగాలు కల్పించటం... 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం... ఇదంతా ఈ ప్రభుత్వం రాసిన కొత్త చరిత్ర కాదా? దీన్ని మీ పత్రిక సాయంతో దాచేయగలరా? 

పారిశ్రామికులు ఏమంటున్నారో తెలియదా? 
ఈ దేశంలో నెంబర్‌–1 గ్రూపుగా వెలుగొందుతున్న రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నుంచి స్టీల్‌ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ అధినేత సజ్జన్‌ జిందాల్, కరణ్‌ అదానీ, సెంచురీ ప్లై భజాంకా, శ్రీ సిమెంట్‌ బంగూర్‌... ఇలా దిగ్గజాలంతా ఇటీవలి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు (జీఐఎస్‌) వేదికపై ఆంధ్రప్రదేశ్‌కు తామిస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఇక్కడి నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళుతున్నారని సభాముఖంగా చెప్పారు. మరి ఇవన్నీ మీకు కనిపించవా రామోజీ? దిగ్గజ పారిశ్రామిక వేత్తలంతా ఇంతలా ప్రశంసిస్తుంటే పరిశ్రమలు రావటం లేదని, ఉద్యోగాలు లేవని ఎందుకీ దౌర్భాగ్యపు రాతలు?  

రామోజీరావు రాస్తున్నట్టుగా ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేకపోతే... పరిశ్రమలు తాము సంతోషంగా ఉన్నామని చెప్పకపోతే... సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించే రాష్ట్రాల్లో (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) గత మూడేళ్లుగా ఏపీ ఎందుకు నెంబర్‌–1గా నిలుస్తుంది? దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఈ హోదా మన రాష్ట్రానికే ఎందుకు దక్కుతోంది? అర నిమిషంలో తనను ముఖ్యమంత్రి ఒప్పించారంటూ... 6 నెలల్లో ఆలోచన నుంచి అనుమతులన్నీ వచ్చి, భూ కేటాయింపు పూర్తయి శంకుస్థాపన చేయగలిగామని సాక్షాత్తూ టెక్‌ మహీంద్రా సీఈఓ గుర్నానీ ప్రశంసించారు.

ఆయన తన కుమారుడి బయో ఇథనాల్‌ ప్లాంటు ‘అస్సాగో’కు ఏపీనే ఎంచుకున్నారు. ఏపీలో పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారని చెప్పింది ఏకంగా ఐటీసీ సీఈఓ సంజీవ్‌ పురి. ఏపీలో అతిపెద్ద స్పైసెస్‌ ప్రాసెస్‌ ప్లాంట్‌ను ఇటీవలే ఆయన ప్రారంభించారు. ఇక ఆదిత్యబిర్లా గ్రూపు వైఎస్సార్‌ జిల్లాలో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేసిన రెండు నెలలకే తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభించింది. తమ గ్రూపు సంస్థలకు ఏపీ కీలకమని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉందని ఆ గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లాయే చెప్పారు.

‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అనే నినాదం ఇప్పుడు ‘జగన్‌ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’ అనేట్లుగా మారిందనేది డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ శర్మ ప్రశంస. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి కొప్పర్తి ఈఎంసీలో భూమి పూజ చేశారాయన. ఇక రూ.600 కోట్లు పెట్టుబడి పెడదామనుకున్నామని, దాన్నిపుడు రూ.2,600 కోట్లకు పెంచుతున్నామని చెప్పింది సాక్షాత్తూ సెంచురీ ప్‌లైవుడ్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక. తమిళనాడులో యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయనే చెప్పారు.

తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంటు ప్లాంట్లున్న శ్రీసిమెంట్‌... తొలిసారి ఏపీలో అడుగుపెడదామని నిర్ణయించుకున్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీసిమెంట్‌ ఎండీ హరిమోహన్‌ బంగూర్‌ కలిశాకే. గుంటూరులో రూ.1,500 కోట్లతో ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది కంపెనీ. మరి ఒక్క కంపెనీ కూడా రాలేదని... ఇప్పటికే ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని విష ప్రచారమెందుకు? 

3 కారిడార్లు ఇక్కడే... 
తాజాగా విశాఖపట్నంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్‌తో పాటు విజయవాడ, తిరుపతి, అనంతపురాల్లో ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కుల ద్వారా లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.  దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లు అభివృద్ధి చెందుతుంటే.. అందులో మూడు కారిడార్లు అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 50 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన మౌలిక వసతులన్నిటినీ కల్పిస్తోంది. రాష్ట్రంలో తిరుపతిలో రెండు,  శ్రీసిటీ,  కొప్పర్తిల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్న ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఇవీ.. ‘ఈనాడు’ చెప్పని వాస్తవాలు.  

నాలుగేళ్లలో నాలుగు పోర్టులు 
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు మరో నాలుగు పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట వేశారు ముఖ్యమంత్రి జగన్‌. దీని ద్వారా ఆయా పోర్టులు ఏర్పాటవుతున్న ప్రాంతాల్లోని స్థితిగతులు సమూలంగా మారబోతున్నాయి. వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి.  వీటితో పాటు 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయాలను చూసుకున్నా ఇటీవలే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికీ అనుమతులు అన్నీ మంజూరయి శంకుస్థాపన రాయి పడింది.

కర్నూలు, కడప విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చి విమానాల రాకపోకలు పెరుగుతున్నాయి. ఇక బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సాధించిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది. 2022వ సంవత్సరంలో అత్యధికంగా పెట్టబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

ఇవన్నీ చెబుతున్నది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగమైన డీపీఐటీ నివేదికలే.  కాకపోతే చంద్రబాబు మైకంలో కొట్టుకుంటున్న ‘ఈనాడు’కు గానీ... ఎల్లో వైరస్‌ సోకిన రామోజీరావుకు గానీ... ఇవేవీ కనిపించవు. జనానికి వాస్తవాలు తెలుస్తున్నాయని, గతంలో మాదిరి తాము చెప్పిందే జనానికి తెలిసే రోజులు పోయాయనే స్పృహ ‘ఈనాడు’కు లేకపోవటమే ఎల్లో ముఠా దౌర్భాగ్యం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement