సాక్షి, అమరావతి/తాడిపత్రి రూరల్: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. వీరు దశాబ్దాలుగా సాగిస్తున్న అక్రమ దందాపై ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. కేంద్ర, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి మరీ దక్షిణాది రాష్ట్రాల అంతటా బస్సులను అక్రమంగా తిప్పుతున్న బాగోతాన్ని వెలికితీస్తోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి.గోపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల నిర్వహించిన దాడుల్లో కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా 154 బస్సులు
జేసీ కుటుంబం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్ 3 మోడల్‌కు చెందిన 154 బస్సులను అశోక్ లేల్యాండ్ కంపెనీ నుంచి తుక్కు పేరుతో కొన్నది. జటాధర ఇండస్ట్రీస్ పేరున 50 బస్సులు, సి.గోపాల్ రెడ్డి అండ్ కో పేరున 104 బస్సులు కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్‌వోసీ పొందారు. తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌లలో రిజిస్ట్రేషన్ చేయించారు.
ఏపీలో 101 బస్సులు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు బస్సులు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. బస్సుల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. దీనిపై అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు.
ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడటం తీవ్రమైన వ్యవహారంగా గుర్తించారు. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నేషనల్ ఇన్సూ్యరెన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీ) రికార్డులను పరిశీలించాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు భావించారు. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల మాటున భారీగా నల్లధనం చలామణి అవుతున్నట్టుగా కూడా గుర్తించారు.
జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. శుక్రవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి, సి.గోపాల్ రెడ్డి నివాసాల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేసి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోన్‌లను కూడా వారు జప్తు చేయడం గమనార్హం.
ఈడీ అధికారులకు సహకరించాం: జేసీ
ఈడీ అధికారులకు సహకరించాం. డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నందుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. సెల్‌ఫోన్ తీసుకున్నందుకు బాధగా ఉంది.
‘త్రిశూల్’ అక్రమాలపై కూడా ఈడీ దృష్టి
జేసీ కుటుంబం మైనింగ్ అక్రమాలపై కూడా ఈడీ కూపీ లాగుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే త్రిశూల్ సిమెంట్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మైన్స్‌కు అనుమతులు పొందారు. దీని ద్వారా దాదాపు లక్ష టన్నుల లైమ్‌స్టోన్‌ను అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు మైన్స్ అండ్ జియాలజీ అధికారులు నిర్ధారించారు. రూ.100 కోట్ల అపరాధ రుసుము కూడా విధించారు.
టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం స్థానిక పరిశ్రమల్లో ట్రాన్స్‌పోర్టు లారీలు, కంటైనర్లన్నీ జేసీ బ్రదర్స్ బినామీల పేరుతో నడిపారు. కంపెనీల్లో లేబర్ కాంట్రాక్టులనూ అనుచరులకే ఇప్పించుకుని వాటాలు తీసుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ వారి సమీప బంధువు అయిన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి పర్యవేక్షించేవారు. వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో అనంతపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు, వ్యవసాయ భూములు కొన్నట్లు సమాచారం.
ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ లావాదేవీలతో పాటు అభివృద్ధి పనుల్లోనూ భారీగా లబ్ధి పొందారు. జిల్లా బహిష్కరణకు గురైన జేసీ ముఖ్య అనుచరుడు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. వాటి పత్రాలను ప్రభాకర్‌రెడ్డి తన వద్ద ఉంచుకున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ అక్రమ మైనింగ్, ఇతర దందాలకు చెందిన పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జేసీ కుటుంబ సభ్యులు, బినామీల ఆర్థిక లావాదేవీలు, దేశంలో, విదేశాల్లో పెట్టుబడుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈడీ సోదాలపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆ ప్రకటన వస్తే... జేసీ బ్రదర్స్ అక్రమాల చిట్టా వెల్లడవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment