
ఆన్‌లైన్‌లో ప్రభుత్వ అధికారులతో సమావేశమైన గవర్నర్ హరిచందన్
సాక్షి, అమరావతి: ప్రతి చిన్నారికి సురక్షితమైన మంచినీరు అందేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గవర్నర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ విభాగాల కార్యదర్శులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని రూపొందించాలని సూచించారు.
గ్రామ పంచాయతీలు, జల, పారిశుద్ధ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల సహకారంతో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలలో ‘100 రోజుల కార్యక్రమం’ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సీఎస్ నీలం సాహ్ని గవర్నర్‌కు వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తదితరులు తమ శాఖల పరిధిలో 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే కార్యాచరణ ప్రణాళికలను తెలియజేశా రు. అంతకుముందు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జల్ జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమం లక్ష్యాలను వివరించారు.