లారీకి రూ.వేయి.. నెలకు రూ.1.50 కోట్లు
యూబీ బీరు కంపెనీకి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ముఠా అల్టిమేటం
కాదన్నందుకు కంపెనీపై దాడి.. విధ్వంసం.. కంపెనీ ప్రతినిధులను చితకబాదిన దుండగులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. కేంద్ర హోం శాఖ ఆదేశంతో ఎట్టకేలకు కేసు నమోదు
కంపెనీ ప్రతినిధులపై అట్రాసిటీ కేసు పెట్టిన ఎమ్మెల్యే వర్గీయులు
మంత్రి అచ్చెన్నాయుడు రంగప్రవేశం
ఎమ్మెల్యే వెనుక ఎవరున్నారో అర్థం చేసుకున్న కంపెనీ ప్రతినిధులు
ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు
మామూళ్లకు సమ్మతించి ఉత్పత్తి ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశం
తప్పనిసరై సరేనన్న కంపెనీ ప్రతినిధులు
అధికార కూటమి నిర్వాకంతో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తాం అని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో తడాఖా చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తరువాత.. ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలంటే కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజులు కూడా కాకుండానే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగిపోయారు.
కంపెనీలకు కళ్లు బైర్లు కమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు రూ.1.50 కోట్లు మామూళ్లివ్వాలని జారీ చేసిన అల్టిమేటం.., అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడటం ద్వారా వారి ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొ చ్చి , కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రంలో ఇకముందు జరగబోయే అరాచకాలకు సూచికగా నిలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండుగేనన్నది సుస్పష్టమవుతోంది.
ప్రతి లారీకీ డబ్బు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్‌ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూళ్లు వసూలు చేసి హడలెత్తించేవి.
ఇటీవల ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూళ్ల వసూలుకు రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్‌చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజూ లోడింగ్, అన్‌లోడింగ్ వచ్చే లారీకి రూ.వేయి చొప్పున మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి.
ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు రూ.5 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.1.50 కోటి.. ఏడాదికి రూ.18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు.
కాదన్నందుకు కంపెనీపై దాడి
ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూళ్ల లెక్కలకు యూబీ కంపెనీ ప్రతినిధులకు కళ్లు బైర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే.. ఈ నెల 15న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీపై దాడి చేసింది.
ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మిని్రస్టేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు.
ఢిల్లీ నుంచి ఒత్తిడితో కేసు నమోదు
ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాషీ్టకంపై యూబీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూబీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. దాంతో తప్పనిసరై జేఆర్ పురం పోలీసులు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులపై ఈ నెల 16వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు.
తమ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. యూబీ కంపెనీ ప్రతినిధులపై ఆయన వర్గీయులతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి యూబీ కంపెనీ ప్రతినిధులపై కేసు పెట్టించి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.
డీల్ సెట్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
ఈ వ్యవహారంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. ఆయన కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడారు. కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే ‘ఏం చేయాలో ’ చెప్పారు. అచ్చెన్న ‘మంత్రం’ పని చేసింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు వెనుక మంత్రి అచ్చెన్న ఉన్నారన్నది యూబీ కంపెనీ ప్రతినిధులకు అర్థమైంది.
టీడీపీ, బీజేపీ కూటమి నేతలు డిమాండ్ చేసిన మామూళ్లు సమర్పించుకుంటే తప్ప ఉత్పత్తి ప్రారంభించలేమని స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో అనివార్యంగా యూబీ కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. వారిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్ర ఆగ్రహావేశాలతో చిందులు తొక్కారు. తమను కాదని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఎలా నడుపుతారంటూ మండిపడినట్టు సమాచారం.
ఢిల్లీ నుంచైనా, ఎక్కడి నుంచి చెప్పించినా సరే.. ఇక్కడ తాము పచ్చజెండా ఊపితేనే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకుంటాయని, లేకపోతే లేదని కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో యూబీ కంపెనీ ప్రతినిధులు బంటుపల్లి ముఠా డిమాండ్ చేసిన మేరకు మామూళ్లు ఇచ్చేందుకు సమ్మతించి తిరిగి వచ్చినట్లు ఆ కంపెనీ వర్గాలే చెబుతున్నాయి.
కప్పం కడితేనే కంపెనీలు
యూబీ కంపెనీ వ్యవహారం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమకు కప్పం కడితేనే కంపెనీలు కార్యకలాపాలు చేపడతాయని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కంపెనీలపై దాడులు, దండయాత్రలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీకే అటువంటి దుస్థితి ఏర్పడితే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment