సాక్షి, అమరావతి: సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తోందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ రెండేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఆయన ఏడాదిలోపే అమలుచేసి చూపించారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆదర్శవంతమైన వ్యవస్థను నెలకొల్పారని తెలిపారు. తద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లారన్నారు.
వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యంతో సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధికి బంగారుబాట వేస్తున్నారని కొనియాడారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘రెండేళ్ల సీఎం జగన్ పరిపాలన – రాష్ట్ర ప్రగతి’పై ఆదివారం వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..
ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం చేరువ
వైద్య రంగానికి సీఎం జగన్ వచ్చాక కేటాయింపులు పెంచారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్యానికి కేవలం 2 శాతం ఖర్చు చేస్తుండగా ఏపీలో సీఎం జగన్ ఆరు శాతం ఖర్చుచేస్తున్నారు. ఆరోగ్యశ్రీని విస్తృతం చేయడం ద్వారా పేద ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశారు.
– జి.శంకరరావు, ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైబల్ డెవలప్‌మెంట్ స్టడీస్ ట్రెజరర్
స్వర్ణాంధ్రప్రదేశ్‌కు బీజం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం చేరువైంది. దేశవ్యాప్తంగా దీనిని అమలుచేయాలన్నంతగా గుర్తింపు పొందింది. కోవిడ్ కాలంలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో మేలు చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్‌కి సీఎం జగన్‌తో బీజం పడింది.
– వారణాసి మల్లిక్,హైకోర్టు న్యాయవాది
రాష్ట్రానికి సీఎం బంగారు బాట
సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే సీఎం జగన్ దూరదృష్టితో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ప్రొడక్టివిటి పెరుగుతుంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో రాష్ట్రానికి బంగారు బాట వేస్తాయని అభిప్రాయపడ్డారు.
– ప్రొ. వెంకటరెడ్డి, ఆర్థికవేత్త
నగదు బదిలీలో సామాజిక న్యాయం
ప్రజల ముంగిటకు సుపరిపాలనను తీసుకెళ్లిన తొలి సీఎం జగన్. కరోనా నేపథ్యంలో ఆరి్థక మాంద్యంలో ప్రజలకు నగదు బదిలీ చేయడాన్ని ఒక రకమైన సామాజిక న్యాయంగా భావించాలి. పాదయాత్ర ద్వారా ప్రజల గుండెచప్పుడు అర్ధం చేసుకున్న పరిశోధకుడుగా పథకాలు అమలుచేస్తున్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఘనత సీఎం జగన్‌దే.
– ప్రొ.హెచ్. లజపతిరాయ్,అంబేడ్కర్ వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్
నగదు బదిలీ దేశంలో ఓ రికార్డు
కరోనా సమయంలో ఇంత భారీగా నగదు బదిలీ జరగడం దేశ చరిత్రలో ఒక రికార్డు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా అవినీతికి తావులేకుండా పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్తున్నారు. కరోనా కాలంలో సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడంవల్ల ఆరి్థక ఇబ్బందులు, ఆత్మహత్యలు లేకుండా ఏపీ ముందుకెళ్లడానికి సీఎం ప్రవేశపెట్టిన పథకాలు ఉపయోగపడ్డాయి.
– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు
ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేసి వాటి ద్వారా గ్రామీణ ప్రజలకు భరోసా కల్పిస్తోంది. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఏపీలో కొత్తగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment