విజయనగరానికి చెందిన రమేశ్ కొన్ని రోజుల క్రితం తమ బంధువుల గృహప్రవేశం కోసం హైదరాబాద్‌లోని కోకాపేటకు వెళ్లారు. అక్కడ కాలక్షేపం కోసం ఫోన్లో ఫేస్‌బుక్ చూడసాగారు. అంతే.. హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రకటనలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఏనాడూ తన ఫేస్‌బుక్‌లో కనిపించని ఈ ప్రకటనలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తాను హైదరాబాద్ వచ్చిన విషయం, కోకాపేట ప్రాంతంలో ఉన్న విషయం తనకు సంబంధం లేని వారికి తెలిసిపోయిందని గుర్తించారు.
లోన్‌యాప్ కంపెనీల ఆగడాలు మరీ దుర్మార్గం. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు అన్నీ ఆ కంపెనీలు తీసుకుంటాయి. అత్యధిక వడ్డీలు వేసి ఇచ్చిన రుణానికి నాలుగు, ఐదింతలు ఎక్కువ డిమాండ్ చేస్తాయి. అడిగినంత చెల్లించకపోతే ఫోన్ నుంచి తీసుకున్న రుణ గ్రహీత ఫొటోలను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ నంబర్లలో ఉన్న బంధువులు, మిత్రులకు పంపించి వేధిస్తుంటాయి.
సాక్షి, అమరావతి: మన ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, ఇతర సమాచారం తెలియాల్సింది మనకు ఒక్కరికే కదా! బయటకు ఎలా వెళ్తోంది? ఇదెలా సాధ్యం అంటే.. మొబైల్ యాప్‌లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల ప్రమేయం లేకుండానే వారి కదలికలు, లావాదేవీలు, ఇతర సమాచారం మొత్తం గుర్తుతెలియని వ్యవస్థలకు యాప్‌ల ద్వారా చేరిపోతున్నాయి.
మన అవసరాల కోసం స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొనే ఈ యాప్‌లతో సౌలభ్యం ఎంతుందో.. వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కూడా అంతే ఉంది. వ్యక్తులు ఉన్న ప్రదేశం, వారి కదలికలు, సామాజిక మాధ్యమాల్లో చూసే వివిధ అంశాలు.. ఇలా అన్నీ యాప్‌లు నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాయి. ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫోన్‌లోని ఫొటోలతోపాటు చివరికి వేలి ముద్రలు, ఎస్‌ఎంఎస్‌లు వేరెవరికో వెళ్లిపోతుంటాయి.
అప్రమత్తతే శ్రీరామరక్ష..
► యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి
► మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు వివిధ అనుమతులు అడుగుతుంది. వాటిని నిశితంగా చదివిన తరువాతే అనుమతించాలి. డౌన్‌లోడ్ చేసుకునే తొందర్లో నిబంధనలను చదవకుండా అనుమతిస్తే తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది
► మనమున్న ప్రదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న యాప్‌లకే లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. యాప్ వినియోగించేటప్పుడు మాత్రమే యాక్సెస్ అనుమతించేలా చూసుకోవాలి
► ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ప్రవేశపెట్టే యాప్‌లకు అన్నింటినీ యాక్సెస్ ఇవ్వాలి. అది అత్యవసర సమయాల్లో పోలీసులు మనకు సహకరించేందుకు ఉపయోగపడుతుంది
► నిషేధిత సంస్థలు, అనుమతి లేని ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థల యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోకూడదు
► ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలు చదివేందుకు, వేలిముద్రను తెలుసుకునేందుకు యాప్‌లకు అనుమతించకూడదు
ఆండ్రాయిడ్ యాప్‌లు..
► 75 శాతం ఇండియన్ ఆండ్రాయిడ్ యాప్‌లతో ఆ ఫోన్ యజమాని ఉన్న ప్రదేశం తెలిసిపోతోంది
► 59 శాతం యాప్‌లు వాటిని ఉపయోగించని సమయంలో కూడా మనం ఉన్న ప్రదేశాన్ని వెల్లడిస్తున్నాయి
► 57 శాతం యాప్‌లు ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను వాడుకుంటున్నాయి
► 76 % యాప్‌లకు కెమెరా యాక్సెస్ ఉంది
► 43 శాతం యాప్‌లతో ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి
► 32 శాతం యాప్‌లతో ఫోన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు కూడా తెలుసుకోవచ్చు
► 25 శాతం యాప్‌లతో ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వేసే వేలిముద్ర తెలిసిపోతుంది
ఐవోఎస్ యాప్‌లు...
► 83 శాతం ఐవోఎస్ యాప్‌లతో మీరు ఉన్న ప్రదేశం తెలిసిపోతుంది
► 81 శాతం యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కెమెరాతో యాక్సెస్ లభిస్తుంది
► 90 శాతం యాప్‌లతో ఫోన్ గేలరీలో ఉన్న ఫొటోలు బట్టబయలైపోతాయి
► 64 శాతం యాప్‌లతో ఫోన్‌లోని మైక్రోఫోన్‌తో యాక్సెస్ వస్తుంది
► 49 శాతం యాప్‌లతో ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి
► 36 శాతం యాప్‌లతో ఫోన్‌లోని క్యాలండర్‌తో యాక్సెస్ లభిస్తుంది.
అర్కా సంస్థ అధ్యయనం..
ప్రముఖ ప్రైవసీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం అర్కా కంపెనీ ‘స్టేట్ ఆఫ్ డాటా ప్రైవసీ’ పేరిట నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే ఇటువంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. అర్కా సంస్థ 200 మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్లను అధ్యయనం చేసింది. వాటిలో మన దేశంలోని 25 రంగాలకు చెందిన 100 యాప్‌లు, వెబ్‌సైట్లు ఉన్నాయి. అమెరికాకు చెందినవి 76, యూరోపియన్ యూనియన్‌లకు చెందినవి 24 ఉన్నాయి.
పిల్లలకు సంబంధించిన 30 యాప్‌ల గురించి కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఆ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే అనుమతులు, ట్రాకర్లు, కుకీలతో వ్యక్తిగత సమాచారం ఇతర సంస్థలకు చేరిపోతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు అత్యధికంగా గూగుల్ కంపెనీ భంగం కలిగిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యాప్‌లకు సంబంధించి ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధాన అంశాలను వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment