
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అదనంగా ఒక రోజు పొడిగించింది. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 6 వరకు పొడిగించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో పాటు వలంటీర్లు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం 65,33,781 మంది లబ్ధిదారుల కోసం రూ.1,800.96 కోట్లను విడుదల చేయగా.. నిర్ణీత ఐదో తేదీ(మంగళవారం) సాయంత్రానికే 64,62,991 మంది లబ్ధిదారులకు రూ.1,781.37 కోట్ల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ మంగళవారం కూడా 81,702 మందికి పైగా లబ్ధిదారులకు వలంటీర్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు.