సమస్య ఏర్పడింది టీడీపీ ప్రభుత్వ హయాంలో. తప్పు చేసింది ఆనాటి పాలకులు. కానీ సిరా నిండా విషాన్ని నింపుకున్న ఈనాడు మాత్రం నాటి ప్రభుత్వ ప్రస్తావన లేకుండానే భూ సమస్యలంటూ కథనాన్ని అచ్చేసింది. భావనపాడు, దేవునల్తాడ, మర్రిపాడు గ్రామాల్లో ఇదే తరహా సమస్యలను పరిష్కరించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నౌపడలోనూ అందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంటే.. అంతలోనే వింత వాదనను జనంపైకి రుద్దే ప్రయత్నం చేసింది. నౌపడలో భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయంటూ అసలు దొంగలను దాచేసి విషపు రాతలను జనం ఇంటికి పంపించింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భూకుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టీడీపీ అమరావతి తరహాలోనే మన జిల్లాలోనూ తన ప్రతాపం చూపించేందుకు విఫలయత్నం చేసింది. 2015 సంవత్సరంలో భావనపాడు పోర్టు పేరుతో వేలాది ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగా 2015 ఆగస్టు 28వ తేదీన భావనపాడు పోర్టు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 5798.02 ఎకరాల భూములను నిషేధిత ఖాతాలోకి మళ్లించింది. దీంతో భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూక్రయవిక్రయాలు జరక్క ఇక్కట్లు పడ్డారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుని 2022 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆ భూములకు విముక్తి కలిగించారు.
నౌపడ పంచాయతీ గ్రామ కంఠంలోని 35 ఎకరాల భూమిని కూడా టీడీపీ ప్రభుత్వంలో 2017 జూలైలో నిషేధిత ఖాతాలోకి మళ్లించారు. 418–1లో 2 ఎకరాలు, 418–2లో 33 ఎకరాలు గ్రామకంఠంలో ఉన్నాయి. కానీ వీటిని నిషేధిత ఖాతాలో పెట్టేశారు. భావనపాడు పోర్టుకు కేంద్ర బిందువు నౌపడ కావడం వల్ల ఇక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరగడంతో అమ్మకం.. కొనుగోలు జరగకుండా టీడీపీ నేత వ్యూహాత్మకంగా దేవదాయ శాఖ భూముల పర్యవేక్షణ పేరుతో వీటిపై ఆంక్షలు విధించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది.
కానీ పచ్చ పత్రిక ‘ఈనాడు’ అంతలోనే రోత పుట్టించే కథనాన్ని వండి వార్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మింది. నాటి అవినీతి మకిలిని ఇప్పటి ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేసింది. భూములకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతులు, పేదల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లింది. వాస్తవంగా గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో పెట్టిన భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ భూ సమస్యను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిష్కరించింది. నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు సర్వహక్కులు కల్పించింది. దీంతో ఆ రైతులు ఆనందంతో ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో నిషేధిత జాబితాలోకి వెళ్లిన నౌపడ గ్రామకంఠం భూముల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఉన్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఇక్కడి సమస్యను కూడా పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందన్నట్టుగా ఈనాడు చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
సమస్య పరిష్కరిస్తాం
నౌపడ గ్రామంలో గ్రామకంఠం సర్వే నంబర్లపై భూములను దేవదాయ అఽధికారుల సమక్షంలో సబ్ డివిజన్ చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.
– చలమయ్య, తహసీల్దార్, సంతబొమ్మాళి.
ఇబ్బందులు పడ్డాం
భావనపాడు పోర్టుతో పేరుతో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 5798 ఎకరాల రైతుల భూమిని నిషేధిత ఖాతాలో పెట్టింది. చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడ్డాం. భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడుకు రైతులంతా విన్నవించినా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విముక్తి కలిగింది.
– బి. మోహన్ రెడ్డి, సర్పంచ్ భావనపాడు.
స్పందనలో ఫిర్యాదు చేశాక..
నౌపడలో నాకు ఇళ్లకు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయి. దీంతో రుణం కోసం బ్యాంకుకు వెళితే స్థలం నిషేధిత ఖాతాలో ఉందని చెప్పారు. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో స్పందనలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాను. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఈ భూములను నిషేధిత ఖాతాలో చేర్చిందని అధికారుల ద్వారా తెలిసింది.
– పరపటి మురళీ, నౌపడ
Comments
Please login to add a commentAdd a comment