వడివడిగా వస్తున్న కృష్ణా జలాలు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
కాలువ నీటిపై రాజకీయం తగదన్న జలవనరుల శాఖ
శాంతిపురం: కుప్పం కాలువలోకి వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువుకు నీరు వదలటంతో అది నిండుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి లాంఛనంగా నీటిని విడుదల చేశారు.
అప్పటికే అధికారుల ట్రయల్ రన్‌తో కాలువ కింది భాగంలోనూ నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి వద్ద పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద నీరు ముందుకు సాగటంతో స్థానిక రైతులు రాత్రి పూట సైతం గంగ పూజలు చేశారు.
అదే క్రమంలో వెంకటేష్ పురం వద్ద ఉన్న చెరువుకు ఉన్న ఓటీ పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నంలోగా ఈ చెరువు పూర్తిగా నిండిపోయింది. మిట్టపల్లి వద్ద గల మద్దికుంట చెరువుకు మంగళవారం అధికారులు నీరు విడుదల చేయటంతో చెరువు క్రమంగా నిండుతోంది. జలకళతో కనువిందు చేస్తున్న ఈ రెండు చెరువులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు.
కృష్ణా జలాలపై తప్పుడు రాజకీయం తగదు
హంద్రీనీవా కుప్పం కెనాల్‌లో నీటి ప్రవాహంపై తప్పుడు రాజకీయం చేయడం తగదని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద బ్రాంచి కెనాల్ నుంచి కుప్పం నియోజకవర్గానికి నీటిని విడుదల చేసినట్టు తెలిపింది. క్రాస్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను వదిలి 70.10 కిలోమీటర్ వద్ద తూము గుండా మద్దికుంట చెరువుకు నీటిని తరలించినట్టు వెల్లడించింది. శాంతిపురం మండలంలో 75.75 కిలోమీటర్ల వద్ద గల వెంకటేష్‌పురం శెట్టివానికుంట చెరువును పూర్తిగా నీటితో నింపినట్టు తెలిపింది.
గుండిశెట్టిపల్లి వద్ద గంగ పూజలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో కాలువలోని 84వ కిలోమీటరు వరకూ నీటిని విడుదల చేసినట్టు వెల్లడించింది. పూజల అనంతరం నీటిని పూర్తిగా మద్దికుంట చెరువుకు మళ్లించి, అది నిండిన తర్వాత నాగసముద్రం, మణీంద్రం చెరువుకు నీటిని పంపే ఏర్పాట్లలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారని తెలిపింది. కానీ.. కొందరు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జలాలు ఆగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువై శ్రీశైలంలో కనీస నీటి నిల్వ ఉన్నప్పటికీ అక్కడి నుంచి 27 చోట్ల ఎత్తిపోతల ద్వారా 733 మీటర్ల ఎత్తులో.. 676 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ప్రాంతానికి ప్రభుత్వం నీటిని ఇస్తోందన్నారు. భగీరథ ప్రయత్నంతో అధికారులను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదని జల వనరుల శాఖ పేర్కొంది.
మాట ప్రకారం నీళ్లిచ్చారు
ఏడాది క్రితం కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నది నీటిని కాలువలోకి విడుదల చేశారు. దీంతో మా ఊరి చెరువు కూడా పూర్తిగా నిండింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. ఆయన తలచుకుంటే ఎప్పుడో మాకు నీటి కష్టాలు లేకుండా చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఓట్లేసే బానిసలుగానే చూశాడు. – మంజునాథ్, రైతు, వెంకటేష్ పురం
నీళ్లు రాలేదంటే కళ్లుపోతాయి
మా ఊరి దగ్గర హంద్రీనీవా కాలువలో సోమవారం నుంచి నీళ్లు పారుతున్నాయి. నీళ్లు వస్తున్నా రాలేదని గంగమ్మ తల్లితో రాజకీయాలు చేస్తే కళ్లుపోతాయి. ఈ ప్రభుత్వం కుప్పానికి నీరు రావటానికి కాలువను సిద్ధం చేసింది. రేపు కృష్ణా నదిలో నీళ్లు వస్తే మా ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వస్తాయి. – జయరామిరెడ్డి, రైతు, దండికుప్పం
Comments
Please login to add a commentAdd a comment