సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి, అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో రాస్తున్న కథనాలన్నీ పచ్చి అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొట్టిపారేశారు. టీడీపీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సరైన అవగాహనలేక నోటికొచ్చినట్లు అసత్యాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దు్రష్పచారాలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కన్నా టీడీపీ హయాంలోనే అప్పులు రెండింతలు పెరిగాయని బుగ్గన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
టీడీపీ హయాంలోనే అప్పులు ఎక్కువ
నిజానికి.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31, 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.4,36,522 కోట్లు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,64,725 కోట్లు మాత్రమే. అలాగే, అప్పు పెరుగుదలని పోల్చిచూస్తే, గత ప్రభుత్వ హయాం 2014–19లో కేంద్ర ప్రభుత్వ అప్పు సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 9.89 శాతం పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు 19.02 శాతం పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసింది. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో కేంద్రం అప్పు సగటు వార్షిక వృద్ధిరేటు 14.37శాతం పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం సగటు వార్షిక వృద్ధి 13.55 శాతమే పెరిగింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు కొనసాగించడానికే చేసింది.
తలసరి అప్పులపై యనమల తప్పుడు లెక్కలు
ఇక తలసరి అప్పు రూ.5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి రూ.లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని యనమల చెప్పేవి తప్పుడు లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ 2022–23 నాటికి రూ.25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్థిక మంత్రి ఇలా మాట్లాడడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో భయాందోళన రేకెత్తించి తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ దుష్టపన్నాగం కాక మరేమిటి?
తలసరిలో వెనుకబాటు బాబు నిర్వాకమే..
చంద్రబాబు 2022–23లో ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే చాల వెనుకబడి ఉందంటున్నారు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ.2,09,848లు ఉంటే ఏపీ తలసరి ఆదాయం రూ.1,54,031లే ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నిర్వాకమే. ఓటుకు కోట్లు కేసు, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు, వడ్డీలతో ఆర్థిక విధ్వంసం.. ఇవే ఏపీ వెనకబాటుకు కారణం. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,19,518లు (2022–23). దేశ తలసరి ఆదాయం రూ.1,72,000లు (2022–23). అంటే 2022–23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6శాతం ఎక్కువ. తలసరి ఆదాయంలో ఏపీ 4వ స్థానంలో ఉంది.
పేదలకు రూ.2,05,109 కోట్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. అవినీతిలేకుండా ప్రతి పైసా ప్రజలకు వారి ఖాతాల్లో జమ అయింది. ఇలా 26 సంక్షేమ పథకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ.2,05,109 కోట్లను డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ప్రతిపక్షాలు కడుపుమంటతో అర్థంలేని విమర్శలు చేయడం శోచనీయం. యనమల, చంద్రబాబు ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం అబద్ధమే. ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాల్జేయడమే వీరి లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment