state growth
-
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధన కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక బృందంగా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక ఉమ్మడి దార్శనికత(విజన్) అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు ‘గతిశక్తి పోర్టల్’ను ఉపయోగించాలని చెప్పారు. ‘వికసిత్ భారత్’ సాధనకు సుపరిపాలన కీలకమని వివరించారు. కీలక అంశాలపై చర్చ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఈ భేటీకి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొందరు సీఎంల తీరు ప్రజా వ్యతిరేకం: బీజేపీ నీతి ఆయోగ్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. వారి నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారహితం అని విమర్శించారు. దేశ అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందించడంలో నీతి ఆయోగ్ పాత్ర కీలకమని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారని ఆక్షేపించారు. 100 కీలక అంశాలపై చర్చించే గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రులు రాకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ రాష్ట్రాల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రధాని మోదీని ఇంకెంత కాలం ద్వేషిస్తారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మోదీని ద్వేషించడానికి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని, మరి ప్రజలకెందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. -
రాష్ట్ర వృద్ధి, అప్పులపై విషప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి, అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో రాస్తున్న కథనాలన్నీ పచ్చి అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొట్టిపారేశారు. టీడీపీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సరైన అవగాహనలేక నోటికొచ్చినట్లు అసత్యాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దు్రష్పచారాలతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కన్నా టీడీపీ హయాంలోనే అప్పులు రెండింతలు పెరిగాయని బుగ్గన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ హయాంలోనే అప్పులు ఎక్కువ నిజానికి.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31, 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.4,36,522 కోట్లు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,64,725 కోట్లు మాత్రమే. అలాగే, అప్పు పెరుగుదలని పోల్చిచూస్తే, గత ప్రభుత్వ హయాం 2014–19లో కేంద్ర ప్రభుత్వ అప్పు సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 9.89 శాతం పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు 19.02 శాతం పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసింది. అదే వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం అప్పు సగటు వార్షిక వృద్ధిరేటు 14.37శాతం పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం సగటు వార్షిక వృద్ధి 13.55 శాతమే పెరిగింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు కొనసాగించడానికే చేసింది. తలసరి అప్పులపై యనమల తప్పుడు లెక్కలు ఇక తలసరి అప్పు రూ.5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి రూ.లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని యనమల చెప్పేవి తప్పుడు లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ 2022–23 నాటికి రూ.25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్థిక మంత్రి ఇలా మాట్లాడడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో భయాందోళన రేకెత్తించి తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ దుష్టపన్నాగం కాక మరేమిటి? తలసరిలో వెనుకబాటు బాబు నిర్వాకమే.. చంద్రబాబు 2022–23లో ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే చాల వెనుకబడి ఉందంటున్నారు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ.2,09,848లు ఉంటే ఏపీ తలసరి ఆదాయం రూ.1,54,031లే ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నిర్వాకమే. ఓటుకు కోట్లు కేసు, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు, వడ్డీలతో ఆర్థిక విధ్వంసం.. ఇవే ఏపీ వెనకబాటుకు కారణం. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,19,518లు (2022–23). దేశ తలసరి ఆదాయం రూ.1,72,000లు (2022–23). అంటే 2022–23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6శాతం ఎక్కువ. తలసరి ఆదాయంలో ఏపీ 4వ స్థానంలో ఉంది. పేదలకు రూ.2,05,109 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. అవినీతిలేకుండా ప్రతి పైసా ప్రజలకు వారి ఖాతాల్లో జమ అయింది. ఇలా 26 సంక్షేమ పథకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ.2,05,109 కోట్లను డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ప్రతిపక్షాలు కడుపుమంటతో అర్థంలేని విమర్శలు చేయడం శోచనీయం. యనమల, చంద్రబాబు ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం అబద్ధమే. ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాల్జేయడమే వీరి లక్ష్యం. -
రాష్ట్ర వృద్ధిరేటు 9.2శాతం
♦ గణాంకాలు వెల్లడించిన రాష్ట్ర అర్థ గణాంకశాఖ ♦ కరువు పరిస్థితులు వెంటాడినా ప్రగతి బాట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వృద్ధిరేటులో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5,83,117 కోట్లకు చేరుకుంది. తలసరి ఆదాయం రూ. 1.43 లక్షలకు పెరిగింది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనా, కరువు వంటి దుర్భర పరిస్థితులు వెంటాడినా... వృద్ధిరేటు పెరిగిన తీరు ప్రగతి పథానికి సూచికగా నిలుస్తోంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి తగ్గిపోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరపు జీఎస్డీపీ అంచనా గణాంకాలను రాష్ట్ర అర్థ గణాంక శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ గణాంకాల నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. ఈసారి కచ్చితంగా.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జీఎస్డీపీని లెక్కించటం ఇదే మొదటిసారి కావడంతో ఈ సారి అంచనాలు ప్రాధానత్య సంతరించుకున్నాయి. గతేడాది వరకు 2004-05 స్థిరధరలను ప్రామాణికంగా తీసుకుని జీఎస్డీపీని లెక్కించారు. ఈసారి 2011-12 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగాలు ద్వితీయ రంగంలో ఉండగా... కొత్త విధానంలో ప్రాథమిక రంగంలోకి మార్చారు. ఇక గతేడాది వరకు 2001 జనాభా లెక్కల ఆధారంగా జీఎస్డీపీని లెక్కించగా... ఈసారి తొలిసారిగా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో పరిశ్రమల శాఖ సర్వే ప్రకారం పారిశ్రామిక రంగం ఆదాయాన్ని అంచనా వేయగా... ఈసారి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీలు సమర్పించిన టర్నోవర్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో అంచనాల్లో మరింత కచ్చితత్వం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత గణాంకాల పునః సమీక్ష కొత్తగా అనుసరించిన విధానం ప్రకారం గడిచిన నాలుగేళ్ల జీఎస్డీపీ గణాంకాలను సైతం పునః సమీక్షించారు. కొత్తగా అనుసరించిన విధానంతో గతేడాది వృద్ధి రేటును 8.8 శాతంగా సవరించారు. ఈ లెక్కన గతేడాదితో ఈ ఏడాది వృద్ధి రేటు 0.4 శాతం పెరిగి 9.2గా నమోదైంది. అదే ప్రస్తుత ఏడాది ధరలతో లెక్కగడితే వృద్ధి రేటును 11.8 శాతంగా అంచనా వేశారు. ఇక గతేడాది రాష్ట్ర స్థూలోత్పత్తి రూ. 5,22,000 కోట్లుకాగా... తాజా లెక్కల ప్రకారం రూ. 5,83,117 కోట్లు. జీఎస్డీపీలో అత్యధికంగా సేవల రంగం వాటా 60.5 శాతం, పారిశ్రామిక రంగం వాటా 22.5 శాతం, వ్యవసాయ రంగం వాటా 17 శాతం ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. తగ్గుతున్న వ్యవసాయ వాటా రాష్ట్ర స్థూలోత్పత్తిలో ఏటా వ్యవసాయ రంగం వాటా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వ్యవసాయ రంగం వృద్ధి 1.9 శాతం తగ్గింది. గతేడాది కూడా 0.4 శాతం తగ్గుదలనే నమోదు చేసింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం పరిధిలోని పంటల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 18.2 శాతం తగ్గింది. కానీ ఇదే రంగం పరిధిలోని పాడి పరిశ్రమ వృద్ధి చెందడం, చేపల పెంపకం పుంజుకోవడంతో ఈ రంగం వాటా 17 శాతానికి చేరుకోగలిగింది. ఇది గత ఏడాది 18.7 శాతం, 2013-14లో 20.2 శాతం కావడం గమనార్హం. ఇక ద్వితీయ రంగం పరిధిలోని తయారీ, పరిశ్రమలు.. తృతీయ రంగంలోని సేవల వాటా పెరగడం రాష్ట్ర వృద్ధిరేటుకు ఊతమిచ్చింది. రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరా, తయారీ రంగం ఆశించిన వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సర్వీసుల వృద్ధిరేటు ‘మైనస్ 14.7 శాతం’ కాగా.. ఈసారి 8.4 శాతం వృద్ధికి చేరడం గమనార్హం. పాడి పరిశ్రమకు ప్రోత్సహకాలతో పాటు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, నిరంతర విద్యుత్ సరఫరాకు ఇచ్చిన ప్రాధాన్యం, జీవన ప్రమాణాల పెంపునకు అమలు చేసిన సంక్షేమ పథకాలు వృద్ధి రేటుకు ఊతమిచ్చాయి. తలసరి ఆదాయం 1.43 లక్షలు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలకు సూచికగా నిలిచే తలసరి ఆదాయం కూడా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.14,000 చొప్పున తలసరి ఆదాయం పెరిగింది. గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,29,000 కాగా.. ఈసారి రూ.1,43,000కు చేరింది. పెరగనున్న రుణ పరిమితి జీఎస్డీపీ పెరగడంతో దామాషా ప్రకారం రాష్ట్ర వార్షిక రుణ పరిమితి పెరగనుంది. నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3 శాతం మేరకు రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ద్రవ్య నిర్వహణ బాధ్యత చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం గరిష్ట రుణ పరిమితిపై ఈ సీలింగ్ ఉంది. జీఎస్డీపీ పెరగడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కలుగనుంది. అత్యధిక వాటా రియల్ఎస్టేట్దే జీఎస్డీపీలో అత్యధిక వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే. గత ఏడాది జీఎస్డీపీలో 19.3 శాతం వాటా పంచుకున్న ఈ విభాగం ఈసారి 20.1 శాతానికి పెరిగింది. తయారీ రంగం 15.1 శాతం, ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసులు 11.2 శాతం, నిర్మాణ రంగం 5.8 శాతం, ఫైనాన్స్ సర్వీసెస్ 6.8 శాతం, మైనింగ్, క్వారీయింగ్ 4.2 శాతం వాటాలు నమోదు చేశాయి.