రాష్ట్ర వృద్ధిరేటు 9.2శాతం | growth rate of 9.2 per cent | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వృద్ధిరేటు 9.2శాతం

Published Wed, Feb 24 2016 3:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రాష్ట్ర వృద్ధిరేటు 9.2శాతం - Sakshi

రాష్ట్ర వృద్ధిరేటు 9.2శాతం

గణాంకాలు వెల్లడించిన రాష్ట్ర అర్థ గణాంకశాఖ
కరువు పరిస్థితులు వెంటాడినా ప్రగతి బాట


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వృద్ధిరేటులో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ. 5,83,117 కోట్లకు చేరుకుంది. తలసరి ఆదాయం రూ. 1.43 లక్షలకు పెరిగింది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనా, కరువు వంటి దుర్భర పరిస్థితులు వెంటాడినా... వృద్ధిరేటు పెరిగిన తీరు ప్రగతి పథానికి సూచికగా నిలుస్తోంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి తగ్గిపోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరపు జీఎస్‌డీపీ అంచనా గణాంకాలను రాష్ట్ర అర్థ గణాంక శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ గణాంకాల నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేశారు.

 ఈసారి కచ్చితంగా..
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జీఎస్‌డీపీని లెక్కించటం ఇదే మొదటిసారి కావడంతో ఈ సారి అంచనాలు ప్రాధానత్య సంతరించుకున్నాయి. గతేడాది వరకు 2004-05 స్థిరధరలను ప్రామాణికంగా తీసుకుని జీఎస్‌డీపీని లెక్కించారు. ఈసారి 2011-12 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగాలు ద్వితీయ రంగంలో ఉండగా... కొత్త విధానంలో ప్రాథమిక రంగంలోకి మార్చారు. ఇక గతేడాది వరకు 2001 జనాభా లెక్కల ఆధారంగా జీఎస్‌డీపీని లెక్కించగా... ఈసారి తొలిసారిగా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో పరిశ్రమల శాఖ సర్వే ప్రకారం పారిశ్రామిక రంగం ఆదాయాన్ని అంచనా వేయగా... ఈసారి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు కంపెనీలు సమర్పించిన టర్నోవర్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో అంచనాల్లో మరింత కచ్చితత్వం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 గత గణాంకాల పునః సమీక్ష
కొత్తగా అనుసరించిన విధానం ప్రకారం గడిచిన నాలుగేళ్ల జీఎస్‌డీపీ గణాంకాలను సైతం పునః సమీక్షించారు. కొత్తగా అనుసరించిన విధానంతో గతేడాది వృద్ధి రేటును 8.8 శాతంగా సవరించారు. ఈ లెక్కన గతేడాదితో ఈ ఏడాది వృద్ధి రేటు 0.4 శాతం పెరిగి 9.2గా నమోదైంది. అదే ప్రస్తుత ఏడాది ధరలతో లెక్కగడితే వృద్ధి రేటును 11.8 శాతంగా అంచనా వేశారు. ఇక గతేడాది రాష్ట్ర స్థూలోత్పత్తి రూ. 5,22,000 కోట్లుకాగా... తాజా లెక్కల ప్రకారం రూ. 5,83,117 కోట్లు. జీఎస్‌డీపీలో అత్యధికంగా సేవల రంగం వాటా 60.5 శాతం, పారిశ్రామిక రంగం వాటా 22.5 శాతం, వ్యవసాయ రంగం వాటా 17 శాతం ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

 తగ్గుతున్న వ్యవసాయ వాటా
రాష్ట్ర స్థూలోత్పత్తిలో ఏటా వ్యవసాయ రంగం వాటా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వ్యవసాయ రంగం వృద్ధి 1.9 శాతం తగ్గింది. గతేడాది కూడా 0.4 శాతం తగ్గుదలనే నమోదు చేసింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం పరిధిలోని పంటల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 18.2 శాతం తగ్గింది. కానీ ఇదే రంగం పరిధిలోని పాడి పరిశ్రమ వృద్ధి చెందడం, చేపల పెంపకం పుంజుకోవడంతో ఈ రంగం వాటా 17 శాతానికి చేరుకోగలిగింది. ఇది గత ఏడాది 18.7 శాతం, 2013-14లో 20.2 శాతం కావడం గమనార్హం.

ఇక ద్వితీయ రంగం పరిధిలోని తయారీ, పరిశ్రమలు.. తృతీయ రంగంలోని సేవల వాటా పెరగడం రాష్ట్ర వృద్ధిరేటుకు ఊతమిచ్చింది. రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, విద్యుత్, నీటి సరఫరా, తయారీ రంగం ఆశించిన వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సర్వీసుల వృద్ధిరేటు ‘మైనస్ 14.7 శాతం’ కాగా.. ఈసారి 8.4 శాతం వృద్ధికి చేరడం గమనార్హం. పాడి పరిశ్రమకు ప్రోత్సహకాలతో పాటు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, నిరంతర విద్యుత్ సరఫరాకు ఇచ్చిన ప్రాధాన్యం, జీవన ప్రమాణాల పెంపునకు అమలు చేసిన సంక్షేమ పథకాలు వృద్ధి రేటుకు ఊతమిచ్చాయి.

తలసరి ఆదాయం 1.43 లక్షలు
రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలకు సూచికగా నిలిచే తలసరి ఆదాయం కూడా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.14,000 చొప్పున తలసరి ఆదాయం పెరిగింది. గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,29,000 కాగా.. ఈసారి రూ.1,43,000కు చేరింది.

 పెరగనున్న రుణ పరిమితి
జీఎస్‌డీపీ పెరగడంతో దామాషా ప్రకారం రాష్ట్ర వార్షిక రుణ పరిమితి పెరగనుంది. నిబంధనల ప్రకారం జీఎస్‌డీపీలో 3 శాతం మేరకు రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ద్రవ్య నిర్వహణ బాధ్యత చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం గరిష్ట రుణ పరిమితిపై ఈ సీలింగ్ ఉంది. జీఎస్‌డీపీ పెరగడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కలుగనుంది.

అత్యధిక వాటా రియల్‌ఎస్టేట్‌దే
జీఎస్‌డీపీలో అత్యధిక వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే. గత ఏడాది జీఎస్‌డీపీలో 19.3 శాతం వాటా పంచుకున్న ఈ విభాగం ఈసారి 20.1 శాతానికి పెరిగింది. తయారీ రంగం 15.1 శాతం, ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసులు 11.2 శాతం, నిర్మాణ రంగం 5.8 శాతం, ఫైనాన్స్ సర్వీసెస్ 6.8 శాతం, మైనింగ్, క్వారీయింగ్ 4.2 శాతం వాటాలు నమోదు చేశాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement