AP: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు  | FAO Conference On Agricultural Systems Transformation In Bangkok | Sakshi
Sakshi News home page

AP: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు 

Published Sat, Oct 8 2022 9:45 AM | Last Updated on Sat, Oct 8 2022 2:22 PM

FAO Conference On Agricultural Systems Transformation In Bangkok - Sakshi

బ్యాంకాక్‌లో ఆర్బీకేల గురించి వివరిస్తున్న పూనం మాలకొండయ్య

సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం: ‘రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన వినూత్నం.. ల్యాబ్‌ టూ ల్యాండ్‌ సాంకేతికత అద్భుతం’ అంటూ ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. వ్యవసాయాధారిత దేశాలన్నీ తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిన, ఆచరించాల్సిన సాంకేతికత పరిజ్ఞానం ఇదని వారు కితాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్‌ సింపోజియంలో ‘వ్యవసాయ వ్యవస్థల పరివర్తన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్బీకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చదవండి: మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్‌ పారిశ్రామిక, లాజిస్టిక్‌ పార్క్‌ 

ఏపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలపై ఆ దేశాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సింపోజియంకు భారత్‌ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్‌ సెక్రటరీ సుభాఠాకూర్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య హాజరయ్యారు. సదస్సు రెండో రోజైన శుక్రవారం మిల్లెట్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియాపై సుభాఠాకూర్‌ ప్రసంగించగా, ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, అమలుతీరుపై పూనం మాలకొండయ్య పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే.. 

సీఎం జగన్‌ ఆలోచన నుంచి పుట్టినవే.. 
పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యం తో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నాం. పరిశోధనా ఫలితాలను నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు (ల్యాబ్‌ టూ ల్యాండ్‌) తీసుకెళ్తున్నాం. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు చేప, రొయ్య సీడ్, ఫీడ్, పశువుల దాణాలనూ ఆర్బీకేల్లో బుక్‌ చేసుకున్న గంటల్లోనే రైతులకు సరఫరా చేస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పుతున్నాద్దాం.

ఈ–క్రాప్, ఈ–ఫిష్‌ బుకింగ్‌ ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లతోపాటు ప్రతీ ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.17వేల కోట్లతో గ్రామస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పిస్తున్నాం’.. అని పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ప్రతినిధులు త్వరలో తమ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆమె ఈ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు.

మా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం 
ఇక గేమ్‌ చేంజర్‌గా నిలిచిన ఆర్బీకేలు అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయని ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఆర్బీకేల గురించి తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆచరింపజేసేందుకు కృషిచేస్తామన్నారు. భారత్‌ వచ్చేందుకు తామూ ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లాదేశ్‌ మంత్రి మహ్మద్‌ అబ్దుర్‌ రజాక్‌ కూడా చెప్పారు. థాయ్‌లాండ్‌తో పాటు యూకే, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, జపాన్, సింగపూర్, హాంకాంగ్, కంబోడియా, టాంగో, కుక్, సోలోమోన్‌ ఐలాండ్స్‌ దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు, శాస్త్రవేత్తలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. 

అట్టడుగు స్థాయికి సేవలు సూపర్‌
‘ఏపీలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అట్టడుగు స్థాయి రైతులకూ సమస్త సమాచారం, ప్రభుత్వం నుంచి సహకారం అద్భుతంగా అందుతున్నాయి. ఇది నిజంగా రైతులకు మంచి ఫలితాలిస్తోంది. అలాగే, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) కూడా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం అభినందనీయం’.. అని జర్మనీలోని హాంబర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జూలియా, రాబీర్, కార్మన్‌ అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎఫ్‌పీవోలను వారు శుక్రవారం పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. తెల్లదోమ ఆశించిన కొబ్బరి ఆకుకు డ్రైకోక్రైసా బదనికల గుడ్లు ఉన్న పేపర్‌ అతికించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. మన దేశంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై అధ్యయనం చేసేందుకు వారు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

ఎఫ్‌పీవోలు బాగా పనిచేస్తున్నాయి 
జర్మనీలో సహకార వ్యవస్థ మాత్రమే ఉందని.. అదే భారత్‌లో సహకార వ్యవస్థతో పాటు ఎఫ్‌పీవోలు కూడా బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు.. వీటిని ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా నిరోధించగలదనే అంశంపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చామన్నారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, ఎఫ్‌పీఓల ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు.. రైతుల నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరడం మంచి పరిణామమని చెప్పారు.

ఈ సందర్భంగా ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబీ), వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు వై. ఆనందకుమారి, ఎన్‌.మల్లికార్జునరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎలియాజర్‌లతో వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలను, సన్న, చిన్నకారు రైతులు వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ రాష్ట్ర అధికారి శ్రీకర్‌ దాసరి, మద్రాస్‌ ఐఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థి రుషీకా, టాటా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సోషల్‌ సెక్షన్‌ విద్యార్థి పునీత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement