జేజీఎల్–384 రకం వరి విత్తనం దొరక్క రైతుల అవస్థలు
పది రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతూ ఎదురు చూపులు
ఒకే ఒక్క దుకాణంలో విక్రయం.. క్యూకట్టిన రైతులు
రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం
నోరు మెదపని ఎమ్మెల్యేలు.. అన్నదాతల ఆగ్రహం
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో వరి విత్తన కొరత తీవ్రంగా ఉంది. కోరిన విత్తనం దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మడులు సిద్ధం చేసుకున్న రైతులు.. అదను దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు పూర్తి స్థాయిలో మాగాణి భూముల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా నాణ్యమైన వరి విత్తనాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
నరసరావుపేట డివిజన్‌తో పాటు వినుకొండ, సత్తెనపల్లి డివిజన్లలోనూ విత్తన కొరత ఉండటంతో ఆయా ప్రాంత రైతులు నరసరావుపేట పట్టణానికి విత్తనాల కోసం తరలి వస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతం నుంచి సరఫరా అవుతున్న స్వల్ప కాలిక రకం జేజీఎల్–384 విత్తనాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపు తున్నారు. 135 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే వంగడం కావడంతో ఈ రకం విత్తనాల కోసం రైతుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.
నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని చిన్నయ్య అండ్ సన్స్ దుకాణంలో సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రైవేటు రకం విత్తనాలను కూడా విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. 25 కి లోల విత్తనాల బస్తా రూ.1,350.. 30 కిలోల విత్తనాల బ స్తా రూ.1,500కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఈ విత్తనం కోసం దుకాణం ఎదుట బారులు తీరుతున్నారు.
పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం
వారం నుంచి విత్తనాల కోసం వందల మంది రైతులు దుకాణం వద్ద పడికాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి రైతులు గ్రామాల నుంచి జేజీఎల్–384 రకం విత్తనాల కోసం తరలి వస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం సాగుతోంది. అయినప్పటికీ బుధవారం ఉదయం రైతుల మధ్య తోపులాట జరగడంతో టౌన్ హాల్‌లో టోకెన్‌లు జారీ చేసేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు.
కొంత మందికి టోకెన్‌లు అందజేసి కౌంటర్‌ను మూసివేశారు. దీనిపై రైతులు నిలదీయడంతో స్టాక్ ఉన్న వరకే టోకెన్‌లు అందజేశామని నిర్వాహకులు తెలిపారు. దీంతో గత్యంతరం లేక రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. టోకెన్‌లు తీసుకున్న రైతులు జోరు వానలోనూ క్యూలైన్‌లో వేచి ఉండటం కనిపించింది. రైతులు అన్ని ఇబ్బందులు పడి టోకెన్ తీసుకున్నా, కేవలం ఒక బస్తానే ఇస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాలు సాగు చేసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం
జేజీఎల్–384 రకం వరి విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేవని, అదే రీతిలో దిగుబడి ఇచ్చే స్వల్ప కాలిక రకాలు ప్రత్యామ్యాయంగా సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు. పల్నాడు ప్రాంతానికి అనుకూలమైన వంగడాలతో పాటు రైతులు ఎక్కువగా ఇష్టపడే అంకుర్ సోనా, అంకుర్–పద్మ, ఏపి–567, అన్నపూర్ణ తదితర రకాల విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
నాలుగు రోజులుగా తిరుగుతున్నా..
జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం నాలుగు రోజు లుగా పట్టణానికి వచ్చి దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం. ఈ రోజు టోకెన్ దొరికితే ఒక బస్తా (25 కిలోలు) ఇచ్చారు. ఐదు ఎకరాల్లో ఈ రకం వేయాలని సిద్ధమయ్యాం. ఒక బస్తాతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. – వసంత శ్రీనివాసరావు, రైతు, పమిడిమర్రు
ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు
వరి విత్తనాల కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. విత్తన దుకాణాల్లోనే అన్ని రకాల విత్తనాలు దొరికేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు కావాల్సిన విత్తనం దుకాణాల్లో దొరకడం లేదు. ఇక్కడ ఒక్క చోటే విత్తనాలు అమ్ముతున్నారు. దీంతో రైతులందరూ ఇక్కడికే రావడంతో తోపులాట జరుగుతోంది. – రావి సుబ్బారావు, రైతు, చీమలమర్రి
రైతులు కోరిన విత్తనాలు అందించాలి
లాభసాటిగా ఉండే విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందించాలి. రైతులు అడిగిన విత్తనం కాకుండా, ఇతర రకాలు సబ్సిడీపై ఇస్తే ప్రయోజనం ఏమిటి? జేజీఎల్ రకం విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – జె.వెంకటేశ్వర్లు, రైతు, తుంగపాడు
Comments
Please login to add a commentAdd a comment