లక్కవరపుకోట (కొత్తవలస, విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి.సుదర్శనదొర కోరారు. మండలంలోని చీపురవలస గ్రామంలో భూములు కొల్పోతున్న రైతులతో అభిప్రాయ సేకరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కాలువ నిర్మాణానికి సహకరిస్తే 3లక్షల ఎకరాలకు సాగునీరు, 8 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. భూములు కొల్పోయే రైతులకు సంతృప్తికరమైన పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
చీపురవలసలో 95 ఎకరాల భూమి కాలువ నిర్మాణానికి అవసరమని పేర్కొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ కాలువ నిర్మాణం జరిగే ప్రాంతంలో పంట పొలాలకు దారి, సాగునీరు మాటేమిటని ప్రశ్నించారు. ఇక్కడ సెంటు భూమి లక్ష రూపాయలకు పైగా ధర పలుకుతోందని, ఆ మేరకు పరిహారం అందజేయాలని కోరారు. లేదంటే కాలువకు ఎంత భూమి కొల్పోతున్నామో అంతే భూమి వేరొక చోట ఇచ్చినా సమ్మతమేనని అభిప్రాయం తెలిపారు. ఈ మేరకు రైతు పోరాట సమితి నాయుకులు చల్లా జగన్, మద్దిల రమణ, గాడి అప్పారావు వినతిపత్రాన్ని అందజేశారు. రైతుల వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా నని సుదర్శనదొర తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం.హర్షవర్ధిని, పోలవరం ప్రాజెక్టు ఏఈలు సి.విజయలక్ష్మి, సర్పంచ్ మచ్ఛ ఎర్రా రామస్వామి, వైఎస్సార్ ïసీపీ నాయకులు లెంక రమన్నపాత్రుడు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment